తరచూ మరమ్మతులకు గురవుతున్న కోవూరు సీపీడబ్ల్యూ తాగునీటి ప«థకం
ఈ తాగునీటి బోర్‌వెల్ వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీ చెరువు ప్రాంతంలో ఉంది. 260 కుటుంబాలకు తాగునీటిని సరఫరా చేసేది. తీవ్రవర్షాభావం, మండు వేసవి కావడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ బోర్ వెల్‌నుంచి సక్రమంగా నీరు రావడం లేదు. పూడిక తీయించి మరమ్మతులు చేస్తే పూర్తిస్థాయిలో నీరు వస్తుంది. పంచాయతీకి చెందిన పీడీ ఖాతాలో(పర్సనల్ డిపాజిట్ అకౌంట్) తాగునీటి నిర్వహణకు సరిపడా నిధులున్నాయి. బోర్‌వెల్‌కు మరమ్మతులు చేసేందుకు డబ్బు డ్రా చేద్దామనుకుంటే డబ్బులున్న తమ పీడీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ చూపిస్తుండటంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ బోర్‌వెల్ మరమ్మతుల పని గురించి ఆలోచించడం పక్కన పెట్టేశారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొంది.
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని 940 పంచాయతీల్లో సర్పంచ్‌ల పాలన గత ఆగస్టు ఒకటో తేదీతో ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలనలోనికి గ్రామాలు వెళ్లాయి. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు వినియోగిద్దామంటే పీడీ ఖాతాల్లో బ్యాలెన్స్ (నగదు) జీరో చూపిస్తోంది. దీంతో పంచాయతీల్లో పాలన నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారి, సెక్రటరీ తమ జేబుల్లో నుంచి డబ్బు ఎందుకు తీసి ఖర్చుపెట్టాలంటూ పాలన గురించి పట్టించుకోవడం మానేశారు.
సీఎఫ్‌ఎంఎస్ పేరుతో ప్రభుత్వం దగా
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ అన్ని శాఖాల లావాదేవీలను ట్రెజరీ ద్వారా నిర్వహించేందుకు సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనే నూతన విధానాన్ని దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 940 పంచాయతీలు, 46 మండల పరిషత్‌లు, జెడ్పీ, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాలకు చెందిన అన్ని రకాల నిధులు, డిపాజిట్లు, గ్రాంట్లు ట్రెజరీలో జమ చేయాలి. ఈ నిధులు సీఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా పీడీ ఖాతాల్లోనికి జమ కావాల్సి ఉంది. ఏ క్యాడర్‌లోనైనా, ఏ స్థాయి అధికారికి అయినా నగదు చెల్లింపులు ఈ సీఎఫ్‌ఎంఎస్ విధానంలో జరగాల్సిందే. అయితే మార్చి తరువాత అన్ని శాఖల నుంచి ట్రజరీకి బిల్లులు పంపినప్పుడు ఆన్‌లైన్‌లో సీఎఫ్‌ఎంఎస్ విధానంలో తీసుకుంటున్నాయి. ఇలా బిల్లులను యాక్సెప్ట్ చేసిన వెంటనే నిధులు విడుదల కావాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాలన్నీ జీరో చూపిస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేయాలో అధికారులకు అర్థం కాక ఉన్నతాధికారులకు తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. ప్రధానంగా పంచాయతీశాఖ, జెడ్పీ అధికారులు గ్రామాల్లోని సమస్యలు తీర్చలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోడ్ పేరుతో డ్రామాలాడుతోంది. ఈ నిధులను కూడా పసుపు–కుంకుమ పథకానికి టీడీపీ పాలకులు ఓట్ల రాజకీయంలో భాగంగా డైవర్ట్ చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
చుక్క నీటికి ఇక్కట్లు
వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయి. ప్రధానంగా మెట్టప్రాంతాలైన ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపురం, వింజమూరు, కలిగిరి, ఏఎస్‌పేట, మర్రిపాడు రాపూరు, సైదాపురం తదితర అనేక మండలాల్లో ప్రజలు చుక్క నీటికి అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ట్యాంకర్లపై ఆధారపడి జీవిస్తున్నారు. జనం నానా పాట్లు పడుతున్నారు. సర్పంచ్‌లు అధికారంలో ఉంటే ముందుగా తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించేవారు. తరువాత నిధానంగా బిల్లులు పెట్టుకుని డబ్బులు తీసుకునే వారు. ప్రత్యేకాధికారుల పాలన కావడంతో ఈ పరిస్థితి లేదు. చిరుద్యోగులైన కార్యదర్శులు తమ జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు చేసినా అవి తిరిగి వస్తాయనే నమ్మకం లేక మిన్నకుండిపోతున్నారు.
దీంతో గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలన పడుతున్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరో వైపు కలెక్టర్ స్పందించి ఈ పరిస్థితిని చక్కదిద్ది తమ సమస్యలు తీర్చాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment