బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు
సాక్షి,న్యూఢిల్లీ : టీడీపీ ప్రభుత్వం చేసిన ‘‘పీడీ అకౌంట్స్ స్కాం’’ బీహార్ దాణా స్కాం కన్నా పెద్దదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. శనివారం గవర్నర్ నరసింహన్‌కు ఆయన లేఖ రాశారు. పీడీ అకౌంట్స్‌లో భారీగా నగదు జమచేయటంపై కాగ్ స్పెషల్ ఆడిట్, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఆయన లేఖ ద్వారా కోరారు. మరికొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం 53,038 కోట్ల ప్రజాధనాన్ని పీడీ అకౌంట్స్‌లో వేసిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లను తెరిచిందని అన్నారు. 2016-17 కాగ్ రిపోర్ట్‌ను చూస్తే ఇదో భారీ కుంభకోణంలా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రులు, టీడీపీ నేతలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు పొంతనలేని సమాధానాలిస్తున్నారని పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం దోపిడీ చేసినట్లు అర్థమవుతోందని అన్నారు. ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీహార్‌లో గవర్నర్ సరైన సమయంలో జోక్యం చేసుకోవటంతో లాలూ ప్రసాద్ యాదవ్, మిగితా నేతలు, అధికారులకు దాణా స్కాంలో శిక్షలు పడ్డాయని అన్నారు. గతంలో బీహార్ ప్రభుత్వం కూడా ఇప్పటి ఏపీ సర్కార్‌లాగే ప్రకటనలు చేయించిందని తెలిపారు. అందుకే గవర్నర్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment