రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక వేలాదిమంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా వారిలో అతి కొద్దిమందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కనీసం వారికైనా పింఛన్ మంజూరు చేశారా అంటే.. అదీ లేదు. ఇక.. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వారు కూడా ఇప్పటికీ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ అందేంతవరకైనా మా ప్రాణాలు ఉంటాయా అంటూ ఎంతోమంది పండుటాకులు దీనంగా ఎదురుచూస్తున్నారు.
కడప రూరల్ : జిల్లాలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత తదితర కేటగిరీలకు చెందిన సామాజిక పింఛన్లను సత్వరమే మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా మలిసంధ్యవేళలో ఉన్న వృద్ధులు, అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హులమైనప్పటికీ తమకెందుకు ఈ తిప్పలని వారు మథన పడుతున్నారు.
నామమాత్రంగా అర్హుల గుర్తింపు
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక జన్మభూమి కార్యక్రమంలో ఆయా మండల ఎంపీడీఓల ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన వారు మొత్తం 44,056 మంది పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వం ఇటీవల 14,233 మందిని అర్హులుగా గుర్తించింది. వారిని కూడా పంచాయతీ స్థాయిల్లో ఉండే కమిటీ సభ్యులు ధ్రువీకరించిన తర్వాతే వారందరినీ పూర్తి స్థాయి అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అయితే, వారికి ప్రభుత్వం ఎప్పుడు పింఛన్ సొమ్మును మంజూరు చేస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇక అనర్హులుగా ఉన్న వారిని అర్హులుగా గుర్తించడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అర్థం కావడం లేదు.
కిరణ్ పాలనలోని అర్హులకు నేటికీ మోక్షం లేదు!
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పింఛన్లు పొందిన వారిపై టీడీపీ ప్రభుత్వం వచ్చాక కమిటీల పేరుతో ఎడాపెడా అనర్హత వేటు వేసింది. దీంతో వేలాది మందికి పింఛన్లు నిలిచిపోయాయి. కొంతమందికి వచ్చినా ఇంకా ఎంతోమందికి రావాల్సి ఉంది.
ఆ ప్రకారం 19,072 మందికి పింఛన్లను నిలిపి వేశారు. వారిలో ఆరు వేల మందికి పైగా అర్హులుగా గుర్తించారు. అయినప్పటికీ వారికి నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. అలాగే ఆధార్‌కు సంబంధించిన ఎస్‌ఆర్‌బీహెచ్ వారు కూడా ఎంతోమందిని అర్హులుగా గుర్తించారు. వారికి కూడా నేటి వరకు పింఛన్ దక్కలేదు. ఆ సొమ్ము ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అర్హులైన వారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్, ఆయా ఎంపీడీఓ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట..
జిల్లాలో ప్రస్తుతం ప్రతినెల అన్ని కేటగిరీలకు చెందిన వారు 2,38,995 మంది పింఛన్లు పొందుతున్నారు. కాగా, ఒక అంచనా ప్రకారం ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే పింఛన్ పొందుతున్న వారు ప్రతినెల 400 మందికి పైగా మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పింఛన్లకు అర్హులై పింఛన్ పొందకుండానే మృతి చెందుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నాళ్లీ.. ఎదురుచూపు
Published Thu, Apr 23 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement