పింఛన్.. వంచన!
పింఛన్ గత సంఖ్య {పస్తుత సంఖ్య
వృద్ధాప్య 1,73,946 1,34,622
వితంతు 1,31,946 1,15,647
వికలాంగులు 41,446 39,906
చేనేతలు 6,581 5,751
ఇతరులు 661 559
సాక్షి, గుంటూరు
జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం అడ్డగోలుగా తొలగించింది. పింఛన్ల సర్వే కమిటీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీగా కోత విధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో మొత్తం 53,095 పింఛన్లు తొలగించారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగినట్లు అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం పునఃపరిశీలనకు ఆదేశించింది.
ప్రస్తుతం పింఛన్ రాలేదని తెలుసుకొన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పింఛన్ అందుకుంటున్న వారి పేర్లు సైతం గల్లంతు కావడం అర్హులను ఆవేదనకు గురిచేస్తోంది.
జిల్లాలో సర్వేకు ముందు 3,49,580 పింఛన్లు ఉండగా ఇందులో 2,96,485 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మిగిలిన 53,095 మంది పింఛన్లను తొలగించారు.
పునః పరిశీలన....
పింఛన్ల తొలగింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకొన్న ప్రభుత్వం పునః పరిశీలన చేపట్టింది. మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఆ గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది.
తొలగించిన వాటిల్లో ఇప్పటికే 20 వేలు అర్హమైనవిగా గుర్తించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసినట్లు సమాచారం. వయస్సు తక్కువ ఉందనే సాకుతో తొలగించిన 5,992 వితంతు పింఛన్లు పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.