పర్చూరు, న్యూస్‌లైన్:
ప్రభుత్వానికి పేద ప్రజల సంక్షేమం కన్నా ప్రచార ఆర్భాటమే ముఖ్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రచారం కోసం పేదప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారు. జిల్లాలో ఎప్పుడో నిర్వహించే రచ్చబండ కార్యక్రమం కోసం జులైలో మంజూరైన పింఛనుదారులకు పింఛను సొమ్ము పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనం. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఎట్టకేలకు గత జులైలో మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పింఛన్లు మంజూరైన వారి పేర్లతో జాబితా కూడా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నగదును ఆగస్టులో ఎంపీడీఓల ఖాతాల్లో జమచేశారు. మండలాల్లో పింఛన్ల నగదు పంపిణీకి సిద్ధమవుతున్న తరుణంలో పంపిణీ ఆపేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. కారణం మంజూరైన వారికి రచ్చబండ కార్యక్రమంలో పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడమే. ఈ క్రమంలో సమైక్య ఉద్యమం రావడంతో ఈ ప్రక్రియ గురించి చర్చేలేకుండా పోయింది. ఉద్యమాలు నిలిచిపోయిన తర్వాత కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
పింఛన్లు మంజూరై సొమ్ము కోసం ఎదురు చూస్తున్న పింఛనుదారులకు పింఛను సొమ్ము అందజేసే కార్యక్రమం చేపట్టలేదు. జిల్లాలో ప్రస్తుతం 2,84,620 మంది పింఛనుదారులున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్లు 1,61,139, చేనేత పింఛన్లు 6646, వికలాంగ పింఛన్లు 28,930, వింతతు పింఛన్లు 70,120, అభయహస్తం పింఛన్లు 17,450 మంది అందుకుంటున్నారు. వీరిలో వికలాంగులకు, అభయహస్తం లబ్ధిదారులు *500, మిగతా వారికి *200 చొప్పున పింఛను సొమ్మును ప్రతినెలా అందజేస్తున్నారు. వీరు కాకుండా మరో 40 వేల మందికి పైగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 24,969 మందికి పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయి. ఎన్నో రోజులుగా పింఛను సొమ్ముకోసం ఎదురుచూస్తున్న వీరికి నగదు అందజేయకుండా కేవలం రచ్చబండలోనే ఆర్భాటంగా ఇచ్చేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు.
కొత్త పింఛన్ల జాబితాలో పేర్లున్న లబ్ధిదారులు మాత్రం మూడు నెలలుగా పింఛను సొమ్ము కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రచారం కోసం మంజూరైన పింఛన్లు సైతం అందజేయకుండా పేదప్రజల జీవితాలతో చెలగాటమాడటం ఎంత వరకు సబబని జనం ప్రశ్నిస్తున్నారు. అసలే నిన్నమొన్నటి వరకు ఉద్యమాలు, ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో జనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మంజూరైన పథకాలను సైతం రచ్చబండ పేరుతో నిలిపివేయడం దారుణం. పింఛన్లకు తోడు 51,904 మందికి రేషన్ కార్డులు సైతం రచ్చబండలోనే అందజేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు రచ్చబండ నిర్వహించే తేదీనే ప్రకటించలేదు. ఇక మంజూరైన పథకాలు ప్రజలకు ఎప్పుడు అందజేస్తారోనని పేద ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.