నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి, ఓపీలో క్యూకట్టిన మహిళలు
సాక్షి, నిడదవోలు (పశ్చిమగోదావరి) : నిడదవోలు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎండమావిగానే మిగిలిపోయింది. సరైన వసతులు లేక వైద్యం కోసం రోగులు క్యూలైన్లలో అవస్థలు పడాల్సివస్తోంది. భవనం పైఅంతస్తులో నాలుగు వార్డుల్లో ఇన్‌పేషెంట్లకు 30 పడకలు ఏర్పాటు చేశారు. కింద భాగంలోని 15 గదులను వివిధ విభాగాల సేవలకు కేటాయించారు. కింద భాగంలో వైద్యులు ఓపీ చూసేందుకు అవసరమైన గదులు నిర్మించకపోవడంతో రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఆసుపత్రి స్థాయి పెంచినా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
1987లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని స్థాపించారు. అప్పటి వైద్యశాఖ మంత్రి 8 పడకల ఆసుపత్రిగా దీనిని ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి మంజూరుకావడంతో 2016లో రూ.2.97 కోట్లతో రెండంతస్తుల పక్కా భవనాన్ని నిర్మించారు. అడ్డదిడ్డంగా భవనాన్ని నిర్మించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిడదవోలు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న 46 గ్రామాల నుంచి రోజూ 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. ప్రతీ మంగళవారం గర్బిణీ స్త్రీలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. నిడదవోలు చట్టు పక్కల గ్రామాల నుంచి∙అధిక సంఖ్యలో పేద వర్గాలు వైద్య పరీక్షలకు ఇక్కడికే వస్తుంటారు. ప్రతీ నెల సుమారు 10 పాము కాటు కేసులు వస్తున్నాయి. అత్యవసర కేసులు, పురుగుమందు తాగిన కేసులు అధికంగానే నమోదవుతున్నాయి.
ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు
30 పడకల ఆసుపత్రి భవనాన్ని తప్ప ఓపీ కోసం వచ్చిన వారితో పాటు ఆసుపత్రి సిబ్బందికి మరుదొడ్లు నిర్మించడం మరిచిపోయారు. ఆసుపత్రి ఫ్లాన్‌లో మరుగుదొడ్లు లేకపోవడంతో వైద్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబందిత కాంట్రాక్టర్, ఆసుపత్రి కమిటీ వారు పట్టించుకోకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు కనీసం మూత్రవిసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆసుపత్రి బయట రాయలవారి చెరువు వద్దకు వెళ్ళి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద భవనం కట్టి మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో ఇదేక్కడి చోద్యమని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత
టీడీపీ ప్రభుత్వంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించారే తప్ప, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆస్పత్రిని ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్, నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు, హెడ్ నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, రేడియో గ్రాఫర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ రూం టెక్నీషియన్, డార్క్‌రూం అసిస్టెంట్, పోస్టుమార్టమ్ గది అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నలుగురు నర్సులు ఉండాలి. వాటిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు, రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తణుకు, రాజమండ్రి ఆస్పత్రులకు..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో మార్గ మధ్యంలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్నింటిని తణుకు, రాజమండ్రి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు ఎటాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు అయోమయానికి గురువుతున్నారు. ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రతి చిన్నదానికి బయటకువెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. దీంతో సీరియస్ కేసులను తణుకు, రాజమండ్రి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో సరైన సామగ్రి లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు.
గైనకాలజిస్ట్, మత్తు వైద్యురాలు ఉండడంతో పురిటి కేసులను చూస్తున్నారు. పురుడు పోసే సమయంలో అత్యవసర వైద్య సేవలు చేసేందుకు పూర్తిస్థాయిలో ఎక్విప్‌మెంట్, హెడ్ నర్సు లేకపోవడంతో తణుకుకు రిఫర్ చేస్తున్నారు. జనరేటర్ పనిచేయకపోవడంతో కరెంట్ లేని సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు ఆసుపత్రిలో ప్రధానంగా 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో కానూరు, తణుకు వాహనాలు వస్తున్నాయి. ప్రతీ మూడు నెలలకు 280 పాము, కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. రేబీస్ వ్యాక్సిన్ కొరతగా ఉంది. పాముకాటు కేసులకు సరైన చికిత్స అందడం లేదు.
గదుల కొరత
ఆసుపత్రుని గదులు కొరత వెంటాడుతోంది, ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ వైద్యులు, ఇద్దరు అవుట్‌సోర్సింగ్ వైద్యులు ఉన్నారు. ఇంకా రెండు పోస్టులు భర్తీ చేస్తే వారికి గదులు లేక ఇబ్బందిపడాలి. పురుగు మందు కక్కించడానికి గది లేకపోవడంతో ఆసుపత్రి బయటనే ఆ పని చేయిస్తున్నారు. క్షత్రగాత్రలకు సిమెంట్ కట్టు వేయడానికి, డ్రస్సింగ్ చేయడానికి, కుట్లు వేయడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మందులు భద్రపర్చడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటిన్నింటికి తక్షణం పరిష్కారం చూపాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment