జిల్లాలో వణికిస్తున్న వైరల్‌ | People Died Due To Viral fever In Guntur | Sakshi
Sakshi News home page

జిల్లాలో వణికిస్తున్న వైరల్‌

Published Fri, Oct 4 2019 11:23 AM | Last Updated on Fri, Oct 4 2019 11:23 AM

People Died Due To Viral fever In Guntur - Sakshi

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు, అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం  

‘సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో 943 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు ఉన్నారు. చిన్నపాటి జ్వరంతో ఆరంభమై మరుసటి రోజుకే ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోవటంతో చికిత్స కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. జ్వరం తగ్గినప్పటికీ ఒళ్లు, కీళ్ళ నొప్పులతో అనేక మంది బాధపడుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు వైద్యులు డెంగీ పేరు చెప్పి   రోగులను దోచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. 

సాక్షి, అమరావతి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నాయి. పది రోజులుగా జిల్లాలో వైరల్‌ జ్వరాల తీవ్రత పెరిగింది. ఇటీవల జిల్లాలో పది మందికిపైగా జ్వరంతో చనిపోయారు. ముప్పాళ్ల మండలంలో ఎక్కువ మంది జ్వరాల బారిన పడ్డారు. కొంత మంది మాత్రం జ్వరం సోకగానే డెంగీ అని హడలిపోతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడ డెంగీ మరణాలు నమోదు కాలేదని చెబుతున్నారు. అనధికారికంగా అయితే ఇటీవల వైరల్‌ జ్వరాల బారినపడి చనిపోయిన వారు డెంగీతోనే చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లెల్లో జ్వరం రాగానే భయంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగు తీస్తున్నారు.  డెంగీ జ్వరం బూచిగా చూపి ప్రైవేటు వైద్యులు భారీగా డబ్బులు గుంజుతున్నారు. వైరల్‌ జ్వరాలు సోకిన వెంటనే ప్రజలను చైతన్య పరచాల్సిన వైద్యాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  

చాగంటివారిపాలెంలో రుద్రబాటి సత్యనారాయణ(75), కలగొట్ల నారాయణమ్మ(45), రాజారపు పేరమ్మ (65), మేడా నవీన్‌కుమార్‌ (5), నీలం కోటయ్య (70), కోటా కాశమ్మ (40), మొచర్ల మధు (6) మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది జ్వరాలతో మృతి చెందినట్లు అనుమానాలు ఉన్నాయి. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్యాధికారుల లెక్కల ప్రకారం ఐదు వేల మందికిపైగా జ్వరాల బారిన పడి చికిత్స పొందారు. వీరి సంఖ్య  అనధికారికంగా ఏడు వేలకుపైగా ఉండవచ్చు. మలేరియా జ్వరంతో 400 మంది, డెంగీ జ్వరంతో 500 మంది ఆస్పత్రి పాలయ్యారు. గుంటూరు నగరంలో పేరుగాంచిన సీనియర్‌ వైద్య నిపుణుడు సైతం ఇటీవల కాలంలో డెంగీ జ్వరంతో చనిపోవడం కలవరపాటుకు గురి చేసింది.

పల్లెల్లో లోపించిన పారిశుద్ధ్యం 
ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దీనికితోడు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఉండటంతో వారు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదు. డ్రెయిన్‌లో సరిగా పూడిక తీయకపోవటంతో రోడ్లపైన మురుగు నీరు నిలుస్తోంది. గ్రామాల్లో కొన్ని  ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉంటోంది. చెత్తా చెదారం సరిగా తొలగించకపోవటంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరగటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కనీసం బ్లీచింగ్‌ కూడా చల్లటం లేదు. ఫాంగింగ్‌ చేయటం లేదు.

ఇలా చేస్తే వ్యాధులు రావు 
దోమల నియంత్రణ కోసం ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా ఇళ్లలో ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. ఇంటి ఆవరణలో ఖాళీ కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎయిర్‌ కూలర్‌లు, పూల కుండీలలో నీటిని మూడురోజులకు ఒకసారి మార్చాలి. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లకు మూతలు బిగించటంతోపాటుగా వారానికి ఒకసారి నీటి గుంటలలో కిరోసిన్, మడ్డి ఆయిల్‌ చల్లించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి.

జ్వరం రాగానే కంగారు పడకూడదు
ఏ జ్వరమో తెలియకుండా ముందస్తుగా మాత్రలు వేసుకోకూకదు. మలేరియానా, డెంగీ జ్వరమా లేక వైరల్‌ ఫీవరా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి. ఏ జ్వరమో తెలియక మందులు వాడితే సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చే ప్రమాదం ఉంది.

కాళ్ల నొప్పులు ఉన్నాయి
జ్వరం తగ్గినా కాళ్ళు, కీళ్ళు నొప్పులు తగ్గటం లేదు. ఐదు రోజుల క్రితం జ్వరం వచ్చింది. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా. జ్వారం తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కాళ్ల నొప్పులు తగ్గటం లేదు.
 – మధిర నాగమల్లేశ్వరి, చాగంటివారిపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement