నిల్వ ఉన్న నీటిపై దోమలు
శీతాకాలం.. సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.. అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి ..దోమలపై దండయాత్ర చేయండి .. ఇది ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారార్భాటాలు. దోమలపై దండయాత్ర ఏమో కానీ దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి.. సాయంత్రం 6 గంటల నుంచి దోమల మోత నగరవాసుల చెవుల్లో ధ్వనిస్తోంది. ఈగల సైజులో ఉన్న దోమలతో కాసేపు ఆరుబయట ఉండలేని పరిస్థితి నెలకొనడంతో నగరవాసులు నరకాన్ని చవిచూస్తున్నారు.
సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ నగర విస్తీర్ణం 61.33 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో 83 కిలోమీటర్లు మేజర్ డ్రెయిన్లు, 258 కిలోమీటర్ల మేర మీడియం, 982 కిలోమీటర్లు మేర మైనర్ డ్రైయిన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో దాదాపు 55 చోట్ల మస్కిటక్ష బ్రీడింగ్ పాయింట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దోమల నివారణకు ఏటా సుమారు రూ.1.25 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ నిధులతో గంబూషియా చేపలను కాలువల్లో, డ్రెయినేజీల్లో వదలడం, దోమల లార్వాను నిర్మూలించేందుకు మందును స్ప్రే చేయడం వంటివి చేయాల్సిఉంది. కానీ అధికారులు మాత్రం ఆదిశగా పనిచేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
డ్రెయినేజీల్లో పేరుకుపోయిన సిల్ట్
నగరంలోని డ్రెయినేజీలు సిల్ట్‌తో నిడిపోవడంతో పొంగి మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఆయా ప్రదేశాల్లో దోమల లార్వా పెరిగి ఉత్పత్తి చెందుతున్నాయి. దీనికి తోడు నగరంలో నత్తనడకన సాగుతున్న స్ట్రామ్ వాటర్‌పనుల్లో పురోగతి లేదు. గోతులు తీసి వదిలేశారు. ఆ గోతుల్లో నీరు నిల్వ ఉండి డెంగీ ఈడిస్ రకం దోమ వృద్ధిచెంది డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరంలోని పటమట, కృష్ణలంక, హైస్కూల్ రోడ్డు, పంటకాలువ రోడ్డు, వన్‌టౌన్‌లోని జెండా చెట్టు సెంటర్, మీసాల రాజేశ్వరరావు రోడ్డు , మొగల్రాజపురం, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, డీవీమినార్ , ట్రెండ్‌సెట్ మాల్ నుంచి మెట్రో పాలిటన్, పాలిటెక్నిక్ కళాశాల, రామవరప్పాడురింగ్ రోడ్డు ప్రాంతాల్లో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిత్యం కాలువల్లో నీరు పొంగి ప్రవహిస్తోంది. పలు చోట్ల మ్యాన్‌హోల్స్ పొంగడంతో దుర్వాసన వెదజల్లుతోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
నగరంలో మలేరియా నివారణకు 347మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 225 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత కూడా వేధిస్తుండటంతో పనిభారం పెరిగి పూర్తిస్థాయిలో సేవలు అందించడంలేదు. దోమల నివారణపై నగర పాలక సంస్థ ప్రజల్లో కనీస అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. సాయంత్రం వేళ కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు.
పాఠాలు నేర్వరేం..
గత ఏడాది నగరంలో దోమల దండయాత్రతో ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడింది. సీజనల్ వ్యాధులు విజృంభించాయి. నగరంలో సుమారు లక్ష మందికి వైరల్ జ్వరాలు సోకాయి. డెంగీ, మలేరియా వ్యాధులతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో పేదవర్గాలపై అదనపు భారం పడింది. కాయకష్టం చేసి సంపాదించిన డబ్బును వైద్యం కోసం వెచ్చించారు. ఈ ఏడాది గడచిన రెండు మాసాల్లో 450 పైగా డెంగీ, మలేరియా జ్వరాల కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే 2015లో 322 కేసులు, 2016లో 550 కేసులు, 2017లో 300 కేసులు నమోదయినట్లు అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. అన ధికారిక లెక్కలు చూస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలల్లో కేసులు నమోదు అయ్యాయి.
నివారణకు చర్యలు చేపట్టాం
నగరంలోని అన్ని డివిజన్లలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే విద్యా సంస్థల్లో దోమలు పెరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాల్వలు, డ్రెయిన్లలో ఎంఎల్ ఆయిల్‌బాల్స్ వినియెగిస్తున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాల సాయంతో రెండురోజులకోసారి ఫాగింగ్ చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – నూకరాజు, బయాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment