
మొగల్తూరు:ఉత్సాహపడుతున్న పర్యాటకులను చూసి ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలు.. లయబద్ధంగా రివ్వున సవ్వడి చేసే సరుగుడు తోటలు.. కనువిందు చేసే సూర్యోదయం, సూర్యాస్తమయాలు.. సేదతీర్చే కొబ్బరి తోటలు.. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే ఆలయాలు.. ఇలా పేరుపాలెం బీచ్ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో బీచ్‌లో విశేషాలు ఇలా..ఏటా కార్తీకమాసం, ప్రతి బుధ, ఆదివారాల్లో పేరుపాలెం బీచ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. మన జిల్లా నుంచే కాక తూర్పు, కృష్టా జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులతో బీచ్ కిక్కిరిసిపోతుంది.
కేపీ పాలెం బీచ్ ప్రాంతంలో సుమారు 20 ఏళ్ల క్రితం ఆర్‌సీఎం మిషనరీ సంస్థ వేళాంకణి మాత ఆలయాన్ని సుందరంగా నిర్మించింది. ఏటా ఏప్రిల్‌లో వేళాంకణి మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన వేంకటేశ్వరస్వామి విగ్రహానికి స్థానికులు ఆలయం నిర్మించారు. ఏటా కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పేరుపాలెం సౌత్ శివారున సముద్రం–ఉప్పుటేరు కలిసే ప్రాంతాన్ని సీ మౌత్ అంటారు. దీనిని మోళ్లపర్రు బీచ్‌గా, కనకదుర్గ బీచ్‌గా పిలుస్తారు. ఈ బీచ్‌లో మరో విశేషమేమిటంటే రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదిగా 54 అడుగుల అభయాంజనేయ విగ్రహం చూపురులను కట్టిపడేస్తుంది. దీంతో పాటు సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పాండురంగస్వామి ఆలయాలున్నాయి. మోళ్లపర్రు బీచ్‌లో రూ.150 కోట్లతో చిల్డ్రన్స్ పార్క్ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే బీచ్ మరింత అహ్లాదకరంగా మారుతుంది.
తస్మాత్ జాగ్రత్త
పేరుపాలెం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏటా కార్తీక మాసంలో నలుగురు, ఐదుగురు యువకులు గల్లంతువుతుండటం పరిపాటిగా మారింది. దీంతో పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అతిగా మద్యం సేవించి సముద్ర స్నానానిక దిగేవారిని అడ్డుకుంటామని, బీచ్ ప్రాంతంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తామని ఇటీవలే డీఎస్పీగా బాద్యతలు చేపట్టిన టీటీ ప్రభాకరరావు తెలిపారు. అంతే కాదు పర్యాటకులను సముద్రంలోపలికి వెళ్ల నీయకుండా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి అకతాయి పనులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సౌకర్యాలు నిల్
మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కాబోతున్నా ఇప్పటివరుకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు బీచ్‌లకు వస్తున్నా ప్రభుత్వ పరంగా సౌకర్యాలు మాత్రం నిల్. సముద్రస్నానానికి వచ్చే మహిళలు స్నానం అనంతరం బట్టలు మార్చుకోవాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఏటా తాత్కాలికంగా పాకలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ప్రయివేటు వ్యక్తులు స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు , సముద్రస్నానం చేసిన అనంతరం స్నానం చేసేందుకు షవర్ బాత్‌లు ఏర్పాటు చేశారు.
మంచినీళ్లు వెంట తెచ్చుకోండి బీచ్‌లకు వచ్చే పర్యాటకులు తమ వెంట మంచినీళ్లు తెచ్చుకోవాలి. లేదంటే బీచ్‌లో అమ్మే వాటర్ ప్యాకెట్లు, మంచినీళ్ల సీసాలకు జేబుకు చిల్లు పడాల్సిందే!
చేరుకునేది ఇలా..
భీమవరం నుంచి వచ్చే పర్యాటకులు వెంప, వారతిప్ప, ముత్యాలపల్లి పేరుపాలెం మీదుగా బీచ్‌కు చేరుకోవచ్చు. నరసాపురం నుంచి వచ్చే పర్యాటకులు సీతారాంపురం, రామన్నపాలెం, పసలదీవి, తూర్పుతాళ్లు మీదుగా రావచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటోలు, బస్సులు, లారీలు, కార్లలో సందర్శకులు బీచ్ ప్రాంతానికి వస్తుండటంతో టోల్‌గేట్ వసూలు చేసి పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి బుధ, ఆదివారాలు నరసాపురం నుంచి బీచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment