పీజీ ప్రవేశాలు..చాలా లేజీ | PG Admissions Are Drowzy Condition In DR BR Ambedkar University | Sakshi
Sakshi News home page

పీజీ ప్రవేశాలు..చాలా లేజీ

Published Tue, Jun 18 2019 8:15 AM | Last Updated on Tue, Jun 18 2019 8:16 AM

PG Admissions Are Drowzy Condition In DR BR Ambedkar University  - Sakshi

సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అఫిలియేషన్‌ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలు అరకొరగానే జరిగాయి. కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు జరగలేదు. వర్సిటీలో పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌కు 727 మంది హాజరయ్యారు. పీజీ సెట్‌లో 871 మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయిం చారు. ప్రస్తుతం సీటు లభించిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. నిబంధనల మేరకు ఫీజులు చెల్లిస్తేనే సీటు ఖరారు అవుతుంది. ఈ నెల 19లోపు ఈ ప్రక్రియ ముగుస్తుంది. 20, 21 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు సగానికి పైగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కనీస ప్రవేశాలు జరగని కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత సెట్‌ నిర్వహిస్తారా? స్పాట్‌ ప్రవేశాలు కల్పిస్తారా? ప్రవేశాలతోనే తరగతులు నెట్టుకువస్తారా అన్న అంశం అధికారులు తీసుకునే నిర్ణయంపై ఆధార పడుతుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 569 సీట్లు ఉండగా, 252 ప్రవేశాలు జరిగాయి. 317 సీట్లు ఖాళీగా మిగిలి పోయాయి. అఫిలియేషన్‌ కళాశాలల్లో 544 సీట్లు ఉండగా, 134 ప్రవేశాలు జరిగాయి. 410 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. వర్సిటీ, అఫిలియేషన్‌ కళాశాలల్లో 1113 సీట్లు ఉండగా, 386 ప్రవేశాలు జరిగాయి. 727 సీట్లు మిగిలిపోయాయి.

మరో పక్క అనుబంధ కళాశాలల్లో సైతం కనీస ప్రవేశాలు లేవు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తెలుగులో రెండు, ఎంకాంలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రభుత్వ మహిళలు కళాశాలల్లో తెలుగులో ఒక్కరూ చేరలేదు. గతంలో తెలుగు పీజీకి డిమాండ్‌ ఉండేది. ఈ ఏడాది వర్సిటీలో సైతం ప్రవేశాలు మెరుగ్గా జరగలేదు. లైఫ్‌ సైన్స్‌లో డిమాండ్‌ ఉన్న జువాలజీ కోర్సు ఒక్క మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే ఉండగా ఎనిమిది ప్రవేశాలు మాత్రమే జరిగాయి. ఒకప్పుడు డిమాండ్‌ ఉన్న ఎంఈడీలో ఈ ఏడాది కనీస ప్రవేశాలు జరగ లేదు. డీఎడ్, డిగ్రీ పూర్తిచేసిన వారికి అనుమతి ఇచ్చినా కనీస ప్రవేశాలు జరగ లేదు. వర్సిటీలో ఎంఈడీలో ఆరు ప్రవేశాలు జరగ్గా, రంగముద్రి, బీఎస్‌జేఆర్‌లో కనీసం ఒక్క ప్రవేశం జరగ లేదు. గతంలో ఎంకాంకు డిమాండ్‌ ఉండేది. వర్సిటీలో 40 సీట్లు ఉన్న కోర్సు 50 సీట్లుగా ఈ ఏడాది పెంచారు. వర్సిటీలో 35 ప్రవేశాలు జరగ్గా, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రజ్ఞ కళాశాలలో ఒక్క ప్రవేశం జరగ లేదు.

వర్సిటీ క్యాంపస్‌లో...

పీజీ కోర్సు     సీట్లు     ప్రవేశాలు
బయోటెక్నాలజీ 30 24
మైక్రోబయోలజీ  20 15
జియోఫిజిక్స్‌ 15 06
ఫిజిక్స్‌   40 27
గణితం 40 31
ఎననాటికల్‌ కెమిస్ట్రీ 20 15
ఆర్గానిక్‌ కెమిస్ట్రీ 29 27
జియోలజీ   15 01
ఎకనమి‍క్స్‌ 40 06
రూరల్‌ డెవలప్‌మెంట్‌ 40 13
సోషల్‌ వర్క్‌  40 04
ఎంఈడీ 40 06
ఎంజేఎంసీ  30 07
ఎంఎల్‌ఐఎస్సీ  30 07
ఇంగ్లీష్‌ 40 11
తెలుగు 40 17
ఎంకాం 50 35

బోధన సిబ్బందే ఎక్కువ!
పీజీ ప్రవేశాలను పరిశీలిస్తే కొన్ని కోర్సుల్లో చేరిన విద్యార్థులు కంటే బోధన సిబ్బంది ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి పీజీ కోర్సులో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. ఈ మేరకు బోధన ఇబ్బంది ఉంటేనే 12(బి), నాక్, ఎన్‌బీఏ వంటి గుర్తింపులు వస్తాయి. అందుకే యూజీసీ నిబంధనల మేరకు వర్సిటీల్లో పోస్టులు కొనసాగిస్తారు. మరో వక్క వర్సిటీలో ఐదు ప్రొఫెసర్, 14 అసోసియేట్‌ ప్రొఫెసర్, రెండు బ్యాక్‌ లాగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తిచేయగా, 33 అసిస్టెంట్‌ ప్రొఫసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవి వాయిదా పడ్డాయి.  జియాలజీలో నలుగురు బోధన సిబ్బంది ఉండగా ఒక్కరే చేరారు. ఎకనామిక్స్‌లో ఐదుగురు బోధన సిబ్బంది ఉండగా ఆరుగురు చేరారు. సోషల్‌ వర్క్‌లో ముగ్గురు రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. ఇద్దరు కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. మరో పక్క ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నోటిఫికేషన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ కోర్సుల్లో నలుగురు విద్యార్థులు చేరారు. ఎంఈడీలో ఆరుగురు డాక్టరేట్‌ చేసిన సిబ్బంది ఉండగా, ఆరుగురు విద్యార్థులు చేరారు. ఎంఎల్‌ఐఎస్సీ, ఇంగ్లీష్, ఎంజేఎంసీలో కనీస ప్రవేశాలు లేవు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement