= ‘ఫైలిన్’ ప్రభావంతో జిల్లాలో వర్షాలు
= ఈదురు గాలులు, భారీ వర్షాలు పెరిగే ప్రమాదం
= జిల్లాకు ప్రత్యేక అధికారిగా బీఆర్ మీనా నియామకం
= కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
= అత్యవసర సేవలకు రెవెన్యూ సిబ్బంది అంగీకారం
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంతో రగిలిపోతున్న జిల్లాకు తుపాను గండం ముంచుకురానుంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతుండటంతో జిల్లా వాసులు కష్టాలను కాస్త ఇష్టంగానే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ‘ఫైలిన్’గా నామకరణం చేసిన తుపాను దెబ్బకు భారీ వర్షాలు, ఈదురుగాలులు ప్రజలను మరింత కుంగదీసే ప్రమాదం ముంచుకురానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి కళింగపట్నం సమీపంలో తీరందాటే అవకాశముందని వాతావరణం నిపుణులు హెచ్చరించారు.
దీని ధాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పెనుముప్పు పొంచివుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తుపాను ప్రమాదాన్ని వెల్లడించడంతో కోస్తా తీరంలో కంగారు మొదలైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక అధికారి నియామకం..
జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు బీఆర్ మీనాను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. జిల్లాలోని మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధర్‌రావు, విజయవాడ సబ్‌కలెక్టర్ దాసరి హరిచందనలను అప్రమత్తం చేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎల్.విజయ్‌చందర్ ‘సాక్షి’కి చెప్పారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసినట్టు వివరించారు.
సహాయక చర్యల కోసం 08672-252572 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు తుపాను అత్యవసర సేవలకు తాము సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్‌వీ చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే రెవెన్యూ సిబ్బంది మాత్రమే సమ్మెను కొనసాగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు..
తుపాను ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. మచిలీపట్నంలో బుధవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సైతం జలమయమై కాలువలను తలపించాయి. పెడనలో భారీ వర్షం కురిసింది. కైకలూరులో మంగళవారం, బుధవారం రాత్రి కూడా కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. గుడివాడ పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోతగా వర్షం పడింది. దీంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉయ్యూరు, పామర్రు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నూజివీడు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.
రైతుల్లో ఆందోళన...
తుపాను హెచ్చరికలతో జిల్లాలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం నాటి వర్షాల వల్ల నష్టమేమీ ఉండదని, పైగా వరి పైరుకు మేలు చేస్తుందని చెబుతున్నారు. తుపాను ప్రభావం వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెండురోజులకు పైగా కొనసాగితే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్ టి.కల్యాణ్ ఒక ప్రకటనలో కోరారు.
తుపాను గండం
Published Thu, Oct 10 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement