ప్రొద్దుటూరు టౌన్ : స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విధంగా రావడం ఇప్పటికి ఐదోసారి. పేదరికాన్ని అధిగమించి స్వశక్తిపై లక్ష్యాన్ని చేరుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మహిళామణులు. బ్యాంకుల నుంచి రూ.కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లిస్తూ ఆర్థికస్వాలంబన సాధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కంటే ముందంజలో ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి.
జనాభా దాదాపు 1.65 లక్షలు. ఇందులో స్లమ్ ఏరియాల్లో నివాసం ఉంటున్న మహిళలు 54,317 మంది ఉన్నారు. 2500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో సభ్యులు దాదాపుగా 25,000 లకు పైగానే ఉన్నారు. వీరందరినీ నడిపించేది టౌన్ లెవెల్ కో ఆర్డినేటర్ కెజియాజాస్లిన్. వారి తరువాత 6 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఒకరు సీఎల్‌ఆర్‌పీగా, మరో 72 మంది ఆర్‌పీలుగా ఉంటూ మహిళలకు చేదోడుగా ఉంటున్నారు.
వీరందరూ గ్రూపుగా ఏర్పడి ప్రతి నెల పొదుపు చేసుకుంటూ వారి పొదుపు డబ్బును అవసరమున్న వారికి ఇచ్చుకొని తిరిగి బ్యాంకులకు జమ చేస్తున్నారు. బ్యాంకుల రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకుకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారంటే మహిళలు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది. పిల్లల చదువుల నుంచి కుటుంబానికి మగవారితో ధీటుగా వారు దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. మరి కొందరు హోటళ్లు నిర్వహిస్తూ బ్యాంకు ద్వారా తీసుకున్న డబ్బుతో మరింత ఎదుగుతున్నారు.
ప్రొద్దుటూరు ప్రస్థానాన్ని పరిశీలిస్తే...
2011-12 ఏడాదికి గాను ప్రభుత్వం 80 గ్రూపులు టార్గెట్‌గా ఇస్తే 158 గ్రూపులను ఏర్పాటు చేశారు. 2012-13 ఏడాదిలో 29కి గాను 147 గ్రూపులు ఏర్పాటు చేసి 506 శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు. 2013-14కు గాను 46 టార్గెట్‌కు 85 గ్రూపులు చేసి 184 శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు. 2014-15కు 41 గ్రూపులకు 51 గ్రూపులు చేసి రూ.20 కోట్లు టార్గెట్‌ను అధిగమించారు. మొత్తం గ్రూపుల్లోని సభ్యులకు రూ.20.04 కోట్ల రుణాలు ఇచ్చి ఈఏడాది జనవరి నెలకే 100.23శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు.
మెప్మా సిబ్బందికి అభినందనలు తెలిపిన కమిషనర్...
బ్యాంకు లింకేజీలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలచడంతో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ మెప్మా టీఎంసీ కెజియాజాస్లిన్, సీఓలు శ్రీదేవి, విమల, రసూలమ్మ, రమణారెడ్డి, హరిత, సర్తాజ్‌లను అభినందించారు. మార్చి వరకు మరో రూ.కోటి దాకా రుణాలు ఇస్తామని వారికి తెలిపారు.
మళ్లీ ..ఫస్టే
Published Mon, Jan 26 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM
Advertisement