మహిళా వర్సిటీలో అమ్మకానికి డాక్టరేట్లు | PhD Doctorates For Sale At Sri Padmavati Womens University | Sakshi
Sakshi News home page

పట్టా పగ్గాల్లేవ్‌!

Published Wed, Aug 28 2019 9:13 AM | Last Updated on Wed, Aug 28 2019 9:13 AM

PhD Doctorates For Sale At Sri Padmavati Womens University - Sakshi

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు రాష్ట్రాల్లో ఏకైక మహిళా వర్సిటీ. మహిళా సాధికారత కోసం ఏర్పాటైంది. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు తమ స్వార్థానికి వర్సిటీ ప్రతిష్టను మంట గలుపుతున్నారు. అక్రమ పీహెచ్‌డీ అడ్మిషన్లకు తెరలేపారు. నిబంధలనకు విరుద్ధంగా ఫారిన్‌ అడ్మిషన్ల పేరిట ఫుల్‌టైం పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చారు. తాజాగా ఈ తరహాలో మరిన్ని అడ్మిషన్లు ఇచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతాల్కి క అధ్యాపకులకు కూడా పీహెచ్‌డీ పర్యవేక్షించే అధికారాలు కట్టబెడుతున్నారు.

సాక్షి, తిరుపతి : మహిళా వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న వారికి దొడ్డి దారిలో అడ్మిషన్లు ఇవ్వడంతో పాటు పీహెచ్‌డీ డిగ్రీలు అమ్మేస్తున్నారు. ఈనెల 17న నిర్వహించిన రీసెర్చ్‌ కమిటీ సమావేశంలో సంబంధిత సబ్జెక్ట్‌లో అర్హత లేని ఒక అధ్యాపకురాలికి ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ రీసెర్చ్‌ గైడ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా పీహెచ్‌డీ డిగ్రీ కల్గిన తాత్కాలిక అధ్యాపకుల(అకడమిక్‌ కన్సల్టెంట్ల)కు పీహెచ్‌డీ గైడ్‌ చేసే అవకాశం కల్పించారు. త్వరలోనే నిర్వహించే పీహెచ్‌డీ అడ్మిషన్లలో తాతాల్కిక అధ్యాపకులకు కూడా పీహెచ్‌డీ పర్యవేక్షించే అధికా రాలు కట్టబెడుతున్నారు. వారికి కేటాయించే సీట్లతో పీహెచ్‌డీ ఖాళీ సీట్ల జాబితా రూపొం దిస్తున్నారు. 2017లో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం అడ్డు చెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. తాజాగా మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ముందుగా బోర్డు ఆఫ్‌ స్టడీస్‌లోను, అకడమిక్‌ సెనేట్‌లోను ఆమోదం పొందాలి. ఉన్నత విద్యామండలిలో అనుమతి తీసుకోవాలి.

నిబంధనలు ఇవీ..
అధ్యాపకులు ఏదైనా సబ్జెక్ట్‌లో రీసెర్చ్‌ గైడ్‌ చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీతో పాటు పీహెచ్‌డీ చేసి ఉండాలి. వర్సిటీ నిర్దేశించిన సంఖ్యలో పరిశోధన ప్రతాలు ప్రచురించి ఉండాలి. వర్సిటీలో పర్మినెంట్‌ సర్వీసులో ఉండాలి. అయితే బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (దూరవిద్య), మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేసిన ఒక అధ్యాపకురాలికి ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో రీసెర్చ్‌ గైడ్‌ చేయడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 17న నిర్వహించిన బోర్డు ఆఫ్‌ రీసెర్చ్‌ స్టడీస్‌ (బీఓఆర్‌ఎస్‌)లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిం చింది. అకడమిక్‌ కన్సల్టెంట్లకు కూడా ఇంట ర్నల్‌ రీసెర్చ్‌ సూపర్‌వైజర్‌గా అవకాశం కల్పిం చాలని తీర్మానం చేశారు. ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు పర్మినెంట్‌ అధ్యాపకులు లేని సెల్ఫ్‌ సపోర్టింగ్‌ కోర్సుల్లో తాత్కాలిక అధ్యాపకులకు రీసెర్చ్‌ గైడెన్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఇలాంటి నిర్ణయాలు, విధానాలు ప్రవేశపెడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సుమారు 30 మందికి పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చారు. ఫారిన్‌ అడ్మిషన్ల పేరిట ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. సైన్స్, ఇంజినీరింగ్‌లలో ఏడాదికి రూ.1.75 లక్షలు, ఆర్ట్స్‌ సబ్జెక్ట్‌లకు రూ.1.50 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు. వీటిల్లో అడ్మిషన్‌ పొందిన వారు మూడేళ్ల పాటు ఫీజు చెల్లించాలి. అంటే దాదాపు 5 లక్షలు చెల్లిస్తే డాక్టరేట్‌ దర్జాగా పొందవచ్చు. ఇప్పటికే 30 మంది ఇలా అడ్మిషన్‌ పొందారు. వీరికి ఫుల్‌టైం రీసెర్చ్‌ స్కాలర్లుగా అడ్మిషన్లు ఇచ్చారు. ఫుల్‌టైంలో అడ్మిషన్‌ పొందిన వారు రెగ్యులర్‌గా యూనివర్సిటీలోని ఆయా విభాగాల్లో హాజరై పరిశోధనలు చేయాలి. అయితే విదేశాల్లో ఉన్న వారందరికీ దొడ్డి దారిలో అడ్మిషన్లు ఇవ్వడంతో పాటు పీహెచ్‌డీ డిగ్రీలు అమ్మేస్తున్నారు.

అర్హత లేకపోయినా..
ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో పీహెచ్‌డీ గైడ్‌ చేయాలంటే ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్‌ల్లో బీటెక్, ఎంటెక్‌ లేకపోతే అధ్యాపకులుగా బోధించడానికి అర్హులు కారని ఏఐసీటీఈ నిబంధనలు చెబుతున్నాయి. అధ్యాపకులుగానే అర్హతలేని వారికి పీహెచ్‌డీ గైడ్‌ చేసే అవకాశమిచ్చారు. కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకులకు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో గైడ్‌ చేసే అవకాశం ఇచ్చి 8 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. తాజాగా మరిన్ని అడ్మిషన్లు ఇచ్చే ప్రయత్నం సాగుతోంది. తాతాల్కిక అధ్యాపకులకు పీహెచ్‌డీ గైడ్‌చేసే అర్హత లేదు. అయినా కూడా  పరిశోధనలు పర్యవేక్షించే అధికారం కల్పిస్తున్నారు.

మరో ద్రవిడ వర్సిటీ కానుందా?
2010లో కుప్పంలోని ద్రవిడ వర్సిటీ, కర్నూలులోని రాయలసీమ వర్సిటీలు నిబంధనలకు విరుద్ధంగా  ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌ పేరిట వేల సంఖ్యలో దూరవిద్యలో పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చాయి. ఈ అంశాన్ని కోర్టులు సైతం తప్పుబట్టాయి. వీటిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. అయినా పాఠాలు నేర్వని మహిళా వర్సిటీ అధికారులు తమ స్వార్థానికి డాక్టరేట్‌ డిగ్రీలను అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అనుమతి ఇచ్చాం
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్లకు పీహెచ్‌డీ గైడ్‌చేసే అవకాశం ఇచ్చాం. ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు ఈ సదుపాయం కల్పించాం. రెగ్యులర్‌ అధ్యాపకులు లేని ఈ విభాగాల్లో అకడమిక్‌ కన్సల్టెంట్‌లకు రీసెర్చ్‌ గైడ్‌చేసే అవకాశం ఇస్తున్నాం.
– ప్రొఫెసర్‌ వీ.ఉమ, ఇన్‌చార్జి వీసీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ

ఆరు నెలలకు ఒకసారి వస్తున్నారు
ఇంటర్నేషనల్‌ పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందిన వారు ఆరునెలలకొకసారి యూనివర్సిటీకి వచ్చి తమ పరిశోధనపై ప్రజెంటేషన్‌ చేస్తున్నారు. ప్రీ పీహెచ్‌డీ,  ప్రీ వైవా, థీసిస్‌ సమర్పణకు క్యాంపస్‌కు వస్తారు. పీహెచ్‌డీ వైవాకు హాజరవుతారు. చాలా దేశాల్లో ఇదే విధానం అమలులో ఉంది.
–ప్రొఫెసర్‌ విజయలక్ష్మి, ఇంటర్నేషనల్‌ డీన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement