మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ ఐదేళ్ల పాలనలో సమగ్రాభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో గ్రామ వార్షిక ప్రణాళికపై మండల అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని వనరులపై దృష్టి పెట్టి ఆదాయ మార్గాలను ఎంచుకుని గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే దానిపై ముందుగా అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు.
వైద్య, ఆరోగ్యం, అంగన్‌వాడీ, విద్యుత్, పంటల సేద్యం, పాఠశాలల నిర్వహణ, పశు సంపద, గ్రామ జనాభా, పశుగ్రాసం, ఉపాధి కూలీల సంఖ్య, స్మశాన వాటిక, రక్షిత మంచినీటి, రోడ్లు, మురుగుకాల్వల పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. గ్రామ పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాల్లో కమిటీలు వేయాలని, అందులో సర్పంచ్, వీఆర్‌ఓ, కార్యదర్శి, యువకులు, ప్రజలను గ్రామభివృద్ధి కమిటీలో ఉంచాలన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారని చెప్పారు. ఇందుకోసం ప్రజలు భాగస్వామ్యంతో సర్పంచ్, కార్యదర్శులు, వీఆర్‌ఓలు గ్రామసభలను ఏర్పాటు చేసి, ఈ నెల 27లోగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. దీనిని జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు మార్చి 31లోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
పంచాయతీకి ప్రభుత్వం నుంచి అందిన గ్రాంట్లను మొత్తం లెక్కలోకి తీసుకుని అంచనాలు తయారు చేయాలన్నారు. పంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు ఇంటి పన్ను, ప్రచార పన్ను, అమ్మకం పన్ను, పరిశ్రమలు, సెల్‌ఫోన్ టవర్లు, నీటి పన్నులు సకాలంలో వసూళ్లు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాలమూరు పారిశుధ్య పక్షోత్సవాల్లో విశిష్ట సేవలందించిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర శాఖ అధికారులను గుర్తించి,గణతంత్య్ర దినోత్సవంలో అవార్డు అందిస్తామన్నారు. సమావేశంలో డీపీఓ రవీందర్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలు పాల్గొన్నారు.
ప్రణాళికలు రూపొందించాలి
Published Sat, Jan 18 2014 3:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement