కొత్తపాలెంలో పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు
తూర్పుగోదావరి, కాట్రేనికోన(ముమ్మిడివరం): కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో గురువారం వైఎస్సార్ సీపీ వర్గానికి చెందిన మహిళలు, వృద్ధులపై పోలీసులు దాడి చేసి లాఠీతో చితక కొట్టారని పులువురు బాధిత మహిళలు రేవు వాణి, బలసాడి శేషారత్నం, బలసాడి సత్యవతి, ఆరోపిస్తున్నారు. కొత్తపాలెం బాధిత మహిళల కథనం ప్రకారం.. 20 ఏళ్లుగా టీడీపీకి మద్ధతుగా నిలిచిచామని, వంతెన వద్ద పనులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో గురువారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటు వేశామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగిందని, పోలీసులు రావడంతో ఇరువర్గాల వారు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నామన్నారు. అయితే టీడీపీ నాయకుడి ఆదేశాలతో ఎస్సై వి.శుభాకర్, పోలీసులు ఇంటిలో ఉన్న తమపై మహిళలని కూడా చూడకుండా లాఠీలతో విరుచుకుపడ్డారని బాధితులు ఆరోపించారు.
బాత్ రూమ్‌కు వెళుతుంటే పోలీసులు కొట్టేశారని విజయ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో భోజనం చేస్తున్న తనపై, నిద్రపోతున్న, స్నానం చేసేందుకు వెళుతున్న మహిళలు, వృద్ధులపై కూడా పోలీసులు లాఠీతో దాడి చేశారని పోలీసు లాఠీచార్జీలో గాయపడిన రేవు వాణి, బలసాడి శేషమ్మ, ఓలేటి దుర్గారావు తదితరులు ఆరోపించారు. పోలీసులు లాఠీ దెబ్బలకు పెమ్మాడి కోయరాజు నడవలేని స్థితికి చేరాడు. ఓలేటి దుర్గారావు ఎడమ చేయి చచ్చుబడి పోవడంతో పైకి లేవడం లేదు. బలసాడి శేషారత్నం అనే వృద్ధురాలి మోకాలిపై కొట్టడంతో నడవలేక పోతోంది. రేవు లక్ష్మి చేతి వేళ్లు మెడపై లాఠీతో కొట్టడంతో వాచిపోయాయి. బలసాడి సత్యవతి, కాలాడి గోవిందును అత్యంత పాశవికంగా కొట్టారు. పోలీసుల దౌర్జన్య కాండలో సుమారు 20 మంది మహిళలు, పురుషులు గాయపడ్డారు. రాత్రి వేళ దాడి చేయడంతో పాటు ఇళ్లకు గొళ్లెం పెట్టడంతో బాత్ రూమ్‌కి సైతం రాలేక పోయామన్నారు. పోలీసుల దౌర్జన్య కాండతో రాత్రంతా బిక్కుబిక్కు మంటూ గడిపామని, తమను కాట్రేనికోన ఎస్సై నుంచి ర క్షించాలని వారు వేడుకుంటున్నారు. బాధితులు ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కాట్రేనికోన ఎస్సై వి శుభాకర్‌ను వివరణ కోరగా ఇరువర్గాలను చెదర గొట్టామని, లాఠీ చార్జి చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment