నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మోహనరావు, పి.గన్నవరం అభ్యర్థి చిట్టిబాబు
తూర్పుగోదావరి ,పి.గన్నవరం: ఎన్నికల్లో ఓటమి భయంతో జనసేన కార్యకర్తలు జి.పెదపూడి గ్రామంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజులను హత్య చేసేందుకు దాడులకు తెగబడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి చిట్టిబాబును అంతమొందించడం ద్వారా బై ఎలక్షన్‌కు కుట్ర పన్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర రావు అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు శుక్రవారం సమావేశమయ్యారు. రవిరాజు ఇంటితో పాటు, ఆయన బంధువుల ఇళ్లపై దాడిచేసి కార్లు, ఆటో, మోటారు సైకిళ్లను ధ్వంసం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.
ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో క్రమశిక్షణతో వైఎస్సార్ సీపీని ముందుకు నడిపిస్తున్నామని మోహనరావు వివరించారు. తొలుత పోలింగ్ బూత్ వద్ద తమ కార్యకర్తలపై దాడిచేసి కొట్టారని, మళ్లీ రాత్రి సమయంలో రవిరాజు ఇంటిపై దాడిచేయడం దారుణమని ఆన్నారు. అభ్యర్థి చిట్టిబాబు, పార్టీకి వెన్నెముకగా ఉన్న రవిరాజులపై పథకం ప్రకారం దాడి చేయడానికి ప్రయత్నించారని అన్నారు. అయితే చిట్టిబాబు, రవిరాజులు తృటిలో తప్పించుకోవడంతో దాడుల నుంచి బయట పడ్డారని వివరించారు. పోలింగ్ పూర్తయిన అనంతరం ఇంటివద్దకు చేరుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడిచేస్తారన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా వారిని రవిరాజు అక్కడి నుంచి పంపించేశారని వివరించారు. ఇళ్లకు వెళుతున్న తమ కార్యకర్తలపై సెంటర్లో జనసేన కార్యకర్తలు దాడిచేశారన్నారు. ఈ దాడులకు పాల్పడిన దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే జనసైనికుల దాడులు
నగరం (మామిడికుదురు): పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదటి మోహనరావు, పి.గన్నవరం అభ్యర్థి కొండేటి చిట్టిబాబు ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓటమి భయంతో జన సైనికులు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. జి.పెదపూడిలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు ఇంటిపై గురువారం రాత్రి జన సైనికులు దాడి చేశారని గుర్తు చేశారు. అక్కడ ఉన్న రవిరాజుతో పాటు పార్టీ శ్రేణులకు చెందిన కార్లు, వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పార్టీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. దీంతో పాటు అక్కడే ఉన్న తనతో పాటు తన కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు జన సైనికులు ప్రయత్నించారని చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాశర్లపూడిలో గురువారం రాత్రి జన సైనికులు భారీగా బల ప్రదర్శన చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
అమాయకులను అరెస్టు చేస్తే ఆందోళన..
జి.పెదపూడి గ్రామంలో దాడుల అనంతరం రవిరాజుకు సంఘీభావం తెలిపి ఇళ్లకు తిరిగి వెళ్తున్న ఇతర గ్రామాలకు చెందిన 15 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్థానిక స్టేషన్‌లో ఉంచారు. ఈనేపథ్యంలో ఎస్సై ఎస్.రాముతో మోహనరావు, రవిరాజు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ దాడుల్లో దెబ్బతిన్నది తమ పార్టీ శ్రేణులని, అయితే తమ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. విచారణ నిర్వహించి అమాయకులైన కార్యకర్తలను విడిచిపెట్టాలని కోరారు. ఈ కేసులో అమాయకులను అరెస్టు చేస్తే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రవిరాజుకు సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులు..
వైఎస్సార్ సీపీ నాయకుడు మంతెన రవిరాజుపై జనసేన కార్యకర్తలు దాడులు చేసిన నేపథ్యంలో జి.పెదపూడి గ్రామంలో శుక్రవారం ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో జి.పెదపూడికి చేరుకున్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment