కత్తిమీద సాములా మారిన ఎన్నికల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ పోలీసు యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని పొందాలని ఎస్పీ నాగేంద్రకుమార్ సిబ్బందికి సూచించారు. తక్షణ స్పందనతో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. విధుల పట్ల అప్రమత్తత, సున్నిత అంశాల పట్ల అవగాహన ముఖ్యమన్నారు.
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠిన వైఖరి, అరాచక శక్తుల పట్ల గట్టి నిఘా, అల్లరి మూకల నియంత్రణ లక్ష్యంగా ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఎస్పీడి. నాగేంద్రకూమార్ వారికి దిశానిర్దేశం చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల దృష్టికి వచ్చిన ఫిర్యాదుల పట్ల చట్టబద్ధతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల వివరాలు మన వద్ద ఉన్నాయని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించటం, గొడవలు సృష్టించే వారెంతటి వారైనా ఉపేక్షించక కేసులు నమోదు చేయటం వల్ల పరిస్థితులు అదుపులో ఉంటాయని తెలిపారు.
మరికొన్ని బలగాలు శుక్రవారం జిల్లాకు చేరుకుంటాయని, సిబ్బంది వినియోగంలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గతంలో జిల్లా మావోయిస్టు ప్రభావితమైనదనే విషయాన్ని మరువరాదని అనుభవజ్ఞులైన సిబ్బంది, అనుకూలమైన వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ వాహనాల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది వద్ద సంబంధిత పోలీస్‌స్టేషన్ల, అత్యవసరమైన ఫోన్ నెంబర్లు ఉండేలా చూడాలని సూచించారు.
తక్షణ స్పందన వల్లే పోలీసు పట్ల ప్రజలకు నమ్మకం కుదురుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, నిఘా చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు.స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 6న నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకర్గ పరిధిలో తొలి విడతగా జరిగే 35 మండలాలకు 325 వాహనాలను సమాకూర్చుతున్నట్లు తెలిపారు. ఆధికారులకు 45 ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ వాహనాల్లో పెట్రోలింగ్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆధికారుల తనిఖీల వింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు.
మాజీ సైనికుల సేవలు అవసరం
సార్వత్రిక, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ సైనికుల సేవలు అవసరమని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ అన్నారు. జిల్లాలో ఉన్న సివిల్, సాయుధ, ప్రత్యేక బలగాలకుతోడుగా హోంగార్డులను, ఫారెస్టు, ఆబ్కారీశాఖకు చెందిన సిబ్బంది ఇప్పటికే విధుల్లో ఉన్నారని, సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్, ఏపీఎస్పీకి చెందిన బలగాలు రానున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవడానికి నిర్ణయించామన్నారు. అరవై ఏళ్లలోపు వయస్సు గల మాజీ సైనికులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రిజర్వు ఇన్పెక్టర్ల కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వారికి గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్బంగా వారు చక్కటి సేవలు అందించారని ఎస్పీ గుర్తుచేశారు.
పోలీస్...అటెన్షన్..!
Published Fri, Apr 4 2014 3:51 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement