ఖమ్మం, న్యూస్‌లైన్: ఐదురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్నవర్షాలతో అన్నదాత అతలాకుతలం అవుతున్నాడు. చేతికొస్తుందనుకున్న పంట నీరుగారుతుంటే పత్తి రైతులు తల్లడిల్లుతున్నాడు. ఈ పంట పోయింది రెండో పంటయినా దక్కకపోతుందా అనుకుంటే కాయలు నల్లబడి కుళ్లిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న మొలకెత్తుతోంది. కోతకొచ్చిన వరి పంట నీటమునిగి పాడైపోయింది. పొట్టదశలో ఉన్న మరికొన్ని పొలాలు నేలవాలాయి. మిర్చి, వేరుశనగ, పొగాకు చేలు దెబ్బతిన్నాయి. నీటిలో మునిగిన చేలు ఊటబారి పోతున్నాయి. ఆరుగాలం కష్టం, అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు నీటిపాలు కావడంతో అన్నదాత గుండెలు బరువెక్కాయి. శుక్రవారం కూడా ఎడతెగకుండా వాన కురిసింది. జిల్లావ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పత్తి, 20వేల ఎకరాల్లో మిర్చి, లక్ష ఎకరాల్లో వరి, పదివేల ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయ పంటలను సాగుచేశారు.
రూ.120 కోట్ల విలువైన పంటలకు నష్టంవాటిల్లినట్లు అంచనా. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వయంత్రాంగం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప తామేమీ చేయలేమని అధికారులు చెబుతుండటంపై రైతుసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
- అశ్వారావుపేట నియోజకవర్గంలో 10వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వర్షాలకు పూత రాలిపోయి, కాయలు నల్లబడ్డాయి. రెండుసార్లు తీయాల్సిన పంటను రైతులు పూర్తిగా నష్టపోయారు. ఒక్కోరైతుకు ఎకరాకు రూ. 15వేల వరకు నష్టం వాటిల్లింది. నియోజకవర్గంలో 7.5 కోట్ల విలువైన పంట దెబ్బతింది. వేరుశనగకు ఇప్పటికే ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు అయ్యాయి. వర్షాల కారణంగా లేత చేలు కొట్టుకుపోగా ముదురుచేలకు వేరుకుళ్లు వ్యాపిస్తోంది.
నియోజకవర్గంలో మొత్తం రూ.21.15 కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు అంచనా.
భద్రాచలం డివిజన్‌లో మిర్చి, వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాల్లో ఏపుగా ఎదిగిన వరి పంట నేలమట్టం అయింది. ఈ మూడు మండలాల్లో సుమారు 700 ఎకరాలకు పైగానే వరి దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. వెంకటాపురంలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మిగతా మండలాల్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. పత్తి తడిసి పోవటంతో మొదటికోత పనికి రాదని రైతులు చెబుతున్నారు. ఎడతెరపి లేని వర్షాలకు మిర్చి మొక్కలు కుళ్లి పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. భద్రాచలం, కూనవరం, దుమ్ముగూడెం మండలాల్లో సుమారు 350 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది.
పినపాక నియోజకవర్గంలో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరువేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం కలిగినట్లు రైతులు చెబుతున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే బూర్గంపాడులో తొలితీత పత్తి సుమారు రెండువేల ఎకరాల్లో దెబ్బతింది. వర్షం ఇలాగే కొనసాగితే అశ్వాపురంలో ఐదువేల ఎకరాల పత్తి నాశనమవుతుంది. మణుగూరులో వెయ్యి ఎకరాలు, పినపాకలో 500, గుండాలలో 600 ఎకరాల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని మండలాల్లో 87వేల ఎకరాల్లో పత్తికి తీవ్రనష్టం వాటిల్లింది. 55వేల ఎకరాల్లో ఇప్పటివరకు ఒక్కసారికూడా పత్తి తీయలేదు. చెట్లపైన ఉన్న పత్తి పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చాయి. పత్తి కాయలు నల్లబడ్డాయి. ఎర్రుపాలెం, బోనకల్, ముదిగొండ మండలాల్లో 250 ఎకరాల్లో మొక్కజొన్నపంట పనికిరాకుండా పోయింది. మిరప మొక్కలు నేలవాలాయి. వర్షం కారణంగా గ్రామాల్లోని అంతర్గతరోడ్లు శిథిలమయ్యాయి. రోడ్లపై బురద ఉండి నడిచేందుకు కూడా వీలులేకుండా పోయింది.
సత్తుపల్లి డివిజన్‌లో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాలలో సుమారు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొట్టదశకు వచ్చిన 1010 వరిపైరు నేలవాలింది. మిరప, మొక్కజొన్న చేలల్లో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలకు వేరుకుళ్లు తెగులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని రైతులంటున్నారు. బేతుపల్లి పెద్దచెరువులోకి 16 అడుగులు, లంకాసాగర్ ప్రాజెక్టు 16 అడుగుల నీటిమట్టానికి చేరుకొని అలుగులు పారుతున్నాయి. డివిజన్‌లో 27వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్ , జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి రైతులు భారీగా నష్టపోయారు. నియోజకవర్గంలో సుమారు 90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దాదాపు 80 శాతం పంట చేలల్లోనే ఉంది. కూలీల కొరత వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు రూ.3 కోట్ల మేర పంటనష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. చేలల్లో పూర్తిగా నీళ్లు నిలిచి ఉండటంతో మిగిలి ఉన్న కాయలకు కాయకుళ్లు వచ్చి రాలిపోయే అవకాశం ఉందని రైతులంటున్నారు.
పాలేరు నియోజకవర్గంలో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట 80 శాతం పైగా దెబ్బతిన్నది. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 50 వేల హెక్టార్లలో పత్తి పూర్తిగా పాడైంది. పత్తి మొదటి దశ తీయాలనుకునే సమయంలో వర్షాలు రావడంతో తడిసి ముద్దైంది. పత్తి పింజలు మొక్కలు వస్తున్నాయి. ఎకరాకు రూ. 20వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాదాపు రూ.2 కోట్ల మేర పత్తి దెబ్బతిన్నట్లు అంచనా. మిర్చితోటల్లో నీరు నిలవడంతో కుళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఇల్లెందు నియోజకవర్గంలో సుమారు 4 వేల హెక్టార్లలో మొక్కజొన్న వర్షానికి తడి సింది. బయ్యారం మండలంలో పలు గ్రామాల్లో రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కల్గింది. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట మొలకెత్తుతోంది. పత్తి మొక్కలు ఎర్రబారాయి. కాయలు నల్లబడుతున్నాయి. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఎకరానికి సుమారు నాలుగు క్వింటాళ్ల చొప్పున పత్తి రంగుమారింది. ఎకరానికి రూ12 వేల చొప్పున 20 వేల ఎకరాల్లో సుమారు రూ.24 కోట్ల మేరకు పత్తి రైతుకు నష్టంవాటిల్లినట్లు అంచనా. మండలంలో మిరప పంట నాలుగువేల ఎకరాల్లో, వరి ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది. వరి నేలవాలగా, మిర్చి తెగుళ్లబారిన పడే అవకాశం ఉంది.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో 20వేల ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, బొప్పాయి, మిర్చి, కూరగాయల పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. మొత్తం రూ. 10కోట్ల మేరకు నష్టం జరిగినట్లు రైతు సంఘాల నాయకుల అంచనా.
కొత్తగూడెం నియోజకవర్గంలో పత్తిపంట దెబ్బతిన్నది. మండలంలోని సుజాతనగర్, సింగభూపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు ఆరువేల ఎకరాల్లో పత్తిపంట తడిసి నల్లబారింది. వరిపైరు పాక్షికంగా దెబ్బతిన్నది. పాల్వంచ మండలంలో సైతం సుమారు ఐదు వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. కొత్తగూడెంలోని గౌతంఖని ఓపెన్‌కాస్టు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జీకే ఓసీలో నాలుగు వేల టన్నులు, జేవీఆర్ ఓసీలో ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మిక ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి.