రైతన్న కష్టం.. నీటిపాలు
రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో అతలాకుతలమైన రైతులు కోలుకోక ముందే గురువారం ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన మిర్చి, మొక్కజొన్న, ధాన్యం తడిసి పోయింది. పాలేరు, వైరా, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలోని పంటలు తడిచి ముద్దయ్యాయి. మామిడి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు.
అలాగే నిజామాబాద్ జిల్లా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన ధాన్యం బస్తాలు నీటి పాలయ్యాయి. బాన్సువాడ, కామారెడ్డి, బోధన్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో, ఇళ్ల వద్ద ఆరబెట్టిన ధాన్యం కుప్పలు నానిపోయాయి. కొన్నిచోట్ల వడగళ్ల వర్షానికి వరి దెబ్బతింది. నేలవాలిన పొలాలను చూసుకుని రైతులు విలపించారు. ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి.
- న్యూస్‌లైన్, ఖమ్మం, నిజామాబాద్