సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాల సందర్భంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులు కసరత్తు ఆరంభించారు. ఇందులో భాగంగా అన్ని శాఖల కంటే ముందుగానే తమ శాఖ సొంత నిధులు రూ.30 కోట్లతో పుష్కరాల పనులకు శ్రీకారం చుట్టారు. అయితే జూలై 14 నుంచి 25 వరకూ పుష్కరాలు జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం అధికారులకు సవాల్‌గా మారనుంది. ఈ దిశగా వారు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు.
జిల్లాలో సగటున రోజుకు 8 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. వేసవిలో ఇది 9 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో రోజుకు 13 నుంచి 15 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండవచ్చన్నది అధికారుల అంచనా. అంటే సగటు సాధారణ వినియోగంకంటే ఐదు నుంచి ఏడు మిలియన్ యూనిట్ల మేర అదనంగా వినియోగం ఉంటుంది. మరోపక్క పుష్కరాల ప్రధాన ఏర్పాట్లు కూడా జూలై మొదటి వారం నుంచి ఊపందుకుంటాయి. కాబట్టి జూలై నెలంతా ప్రతి రోజూ అదనంగా రెండు మిలియన్ యూనిట్ల మేర వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
సాధారణంగా సగటున జిల్లాలో నెలకు 240 నుంచి 270 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటుంది. పుష్కరాల నెల కావడంతో జూలైలో ఈ వినియోగం 360 నుంచి 375 మిలియన్ యూనిట్లకు చేరవచ్చని అంటున్నారు. పెరగనున్న ఈ డిమాండును దృష్టిలో ఉంచుకొని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అవసరమైతే ఇతర జిల్లాలకు సరఫరాను తగ్గించి, మన జిల్లాకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలు జరిగే జూలై నెలనాటికి నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేస్తాయి. దీంతో వానలు కురిసి, సాధారణ వినియోగం తగ్గవచ్చని, కాబట్టి సరఫరాకు లోటు ఉండదని ఈపీసీడీఎల్ ఎస్‌ఈ గంగాధర్ అభిప్రాయపడుతున్నారు.
నగరంలో రూ.30 కోట్లతో పనులు
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా రాజమండ్రిలో ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణం ఇప్పటికే కొనసాగుతోంది. గోదావరి మహాపర్వానికి ప్రధాన వేదిక కాబట్టి.. నగరంలోని ఒక ప్రాంతంలో కరెంటు పోతే మరో ప్రాంతం నుంచి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు వీలుగా రాజమండ్రిలోని మొత్తం అన్ని 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే 16 సబ్‌స్టేషన్లను ఈవిధంగా అనుసంధానం చేశారు. నగరంలో మొత్తం 683.39 కిలోమీటర్ల మేర ఎల్‌టీ లైన్లు పాతబడ్డాయి. వీటి స్థానంలో కొత్త వైర్లు వేస్తున్నారు. 33 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లకు 149.20 కిలోమీటర్ల పొడవున ఉన్న వైర్లను కూడా మార్చనున్నారు. లో ఓల్టేజి సమస్య రాకుండా కొత్తగా 191 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు జరుగుతోంది. ఇలా మొత్తం రూ.30 కోట్లతో వివిధ పనులు జరుగుతున్నాయి.
నిరంతర కాంతులపై కసరత్తు
Published Tue, Jan 20 2015 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement