
వేటుకు సిద్ధం..!
ఎర్రగుంట్ల:
తమ అనుయాయులకు ఆర్టీపీపీలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు ప్రస్తుతం ఆర్టీపీపీలో పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీపీపీలో సుమారు 2500 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇందులో 1100 మంది ఉద్యోగులు, సుమారు 900 మంది కాంట్రాక్టు కార్మికులు, మిగిలిన వారు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ఆర్టీపీపీలో ఏ ఒక్క కార్మికుడిని తొలగించిన దాఖలాలు లేవు.
టీడీపీ అధికారంలోకి రావడంతో తమ అనుయాయులకు అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు ఓ ఎంపీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జెన్‌కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీజెన్‌కో డైరక్టర్ ఒకరు పదిరోజుల క్రితం వచ్చి ఆర్టీపీపీలో ఎవరు నిర్లక్ష్యంగా డ్యూటీలు చేస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వెళ్లిపోయారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులలో గుబులు రేగుతోంది. ఒకరిని తొలగించినా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ను వివరణ కోరగా ఆర్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులతో బాటు కాంట్రాక్ట్ కార్మికులలో ఏ ఒక్కరినీ తొలగించమన్నారు.