ఫలించిన ఓ తల్లి న్యాయపోరాటం : ఆ నలుగురికి జైలు! | Prison to the four members | Sakshi
Sakshi News home page

ఫలించిన ఓ తల్లి న్యాయపోరాటం : ఆ నలుగురికి జైలు!

Published Sat, Sep 13 2014 8:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

అప్పటి సిఐ విజయకుమార్, ఎస్ఐ టి.బ్రహ్మయ్య, సెల్వరాజ్, వైద్యాధికారి నూరుల్ హుదా

అప్పటి సిఐ విజయకుమార్, ఎస్ఐ టి.బ్రహ్మయ్య, సెల్వరాజ్, వైద్యాధికారి నూరుల్ హుదా

పొన్నూరు రూరల్ : ఓ కన్న తల్లి ఆరేళ్లపాటు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆమె కుమారుడిని హింసించారన్న కేసులో ముగ్గురు పోలీస్ అధికారులు, మరో ప్రభుత్వ వైద్యుడికి ఏడాదిపాటు జైలు శిక్ష, మరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు పూర్వాపరాలు ఇలావున్నాయి.

     తనకు ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  2008 సెప్టెంబర్ 24న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన సౌపాటి రవి అనే వ్యక్తిని అప్పటి రూరల్ ఎస్‌ఐ టి. బ్రహ్మయ్య అరెస్టు చేశారు. ఇది తెలిసి స్టేషన్‌కు చేరుకున్న గ్రామస్తులకు రవిని చూపించకుండా పంపివేశారు. ఆ రోజు రాత్రి సిఐ విజయకుమార్, ఎస్‌ఐ బ్రహ్మయ్యలు లాఠీలతో రవి అరికాళ్లపై  తీవ్రంగా కొట్టి హింసించారు. మరుసటి రోజు గాయాలతో వున్న రవిని చూసి తల్లి బోరున విలపించింది. పోలీసుల తీరుపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో జడ్జి,  లాం శ్రీనివాస్‌ను అడ్వకేట్ కమిషన్‌గా నియమించారు.

     పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న రవిని గుర్తించిన శ్రీనివాస్ డ్యూటీలో ఉన్న ఏఎస్‌ఐ సెల్వరాజ్ సమక్షంలో  బాధితుడు నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం రవిని అప్పటి జడ్జి చంద్రశేఖర్ ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశం మేరకు గాయపడిన రవికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించారు.   నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యాధికారి నూరుల్‌హుదా పోలీసులకు అనుకూలంగా తప్పుడు రిపోర్టు ఇచ్చారు. ఇది గుర్తించిన బాధితుని బంధువులు స్థానిక న్యాయవాది జి.ఎస్ రాయల్‌ను ఆశ్రయించగా, ఆయన బాధితుని తరఫున కోర్టులో వాదించారు. అదే నెలలో బాధితుడు రవిని విడుదల చేశారు.

  కేసు  కోర్టులో ఉండగానే  సిఐ విజయకుమార్ ప్రమోషన్ పొంది డీఎస్పీగా పదవీ విరమణ చేశారు. రూరల్ ఎస్‌ఐ టి. బ్రహ్మ య్య ప్రస్తుతం సిఐడీ విభాగంలో సీఐగా ఉన్నారు. ఏఎస్‌ఐ సెల్వరాజ్ ఎస్‌ఐగా రిటైర్ అయ్యారు. అప్పటి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నూరుల్‌హుదా ప్రస్తుతం పాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు.   ఆరేళ్ల సుధీర్ఘ న్యాయపోరాటం అనంతరం వాదప్రతివాదనలు విన్న జడ్జి కె. రవి, అప్పటి సిఐ విజయకుమార్, ఎస్‌ఐ టి. బ్రహ్మయ్య, ఏఎస్‌ఐ సెల్వరాజ్, వైద్యాధికారి నూరుల్‌హుదాలకు ఒక సంవత్సరం జైలుశిక్ష, మరో  వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.  
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement