శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న సర్కార్‌గా అపప్రదను మూటకట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉండే బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఆవిర్భావ రోజుల్లోనే పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లే పనికి పూనుకున్నాయని, అయినప్పటికీ దీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పాలన స్థంభించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని దుయ్యబట్టారు.
జిల్లాలో నదీ పరివాహకప్రాంతం ఉన్నప్పటికీ ఇసుక దొరకని దుస్థితి నెలకొందని, సిమెంటు ధర బస్తా రూ. 400కు చేరుకోవడంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయి కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి అన్యాయంగా భూమిని లాక్కుని సింగపూర్ రియల్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దోచిపెడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోందన్నారు. మండల, గ్రామస్థాయిలో కమిటీలు వేయడం జరిగిందన్నారు. కలసికట్టుగా పనిచేసి ఇతర పార్టీల వారిని మన పార్టీలో చేర్చుకునేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఏ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో, దీని లక్ష్యం, ఆశయం ఏమిటో అందరికీ తెలుసన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ(యువజన శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ) బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించి వై.ఎస్.ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు అందించాలనే ఆశయంతో దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో వేరే పార్టీలో విలీనం అయిపోతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని.. వీటిని తిప్పికొడుతూ మొదటగా వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారన్నారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని పార్టీ ప్రభంజనం చాటిందన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయి 67 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామన్నారు. కార్యక్రమానికి ముందు దివంగత వైఎస్ చిత్రపటానికి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం(వరం), ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, చల్లా అలివే లు మంగ, ఎన్ని ధనుంజయ్, డాక్టర్ పైడి మహేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, చల్లా రవి, శిమ్మ రాజశేఖర్, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు, పసగడ రామకృష్ణ, తెలుగు సూర్యనారాయణ, ధర్మాన రఘునాథమూర్తి, శిమ్మ వెంకటరావు, టి.కామేశ్వరి, కె.సీజు, పొన్నాడ రుషి, గుమ్మా నగేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సర్కార్‌పై ప్రజావ్యతిరేకత
Published Fri, Mar 13 2015 2:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement