పలాస: థర్మల్ ప్లాంట్ పేరుతో సోంపేట, కాకరాపల్లి సంఘటనలను పునరావృతం చేయవద్దని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో ఆదివారం రౌండు టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఉద్దానంలో పవర్ ప్లాంటు ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉద్దానంలో డయాలిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్దానం ప్రాజెక్టు ద్వారా క్రమం తప్పకుండా మంచినీరు సర ఫరా చేయాలని, బహుళజాతి కంపెనీలతో ప్రభుత్వాలు కుదుర్చుకున్న అన్ని రకాల ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్మల్ ప్రాజెక్టులను వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలు రద్దు చేయకపోగా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం దారుణమన్నారు. ప్రశాంత ఉద్దానంలో విధ్వంసకర పరిశ్రమలను పెట్టడాన్ని విరమించుకోవాలన్నారు.
థర్మల్ ప్రాజెక్టును పెట్టాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రజలు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. జీవితాలపై తీవ్రప్రభావం చూపే ప్లాంట్‌ను అడ్డుకోవడానికి ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎస్.వీరాస్వామి, పి.నారాయణరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు పుచ్చ దుర్యోధన, ప్రజా కళామండలి నాయకుడు జుత్తు శంకర్, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు జోగి కోదండరావు, టెక్కలి డివిజన్ రైతాంగ సాధన క మిటీ నాయకుడు దాసరి శ్రీరాములు, కుల నిర్మూలన కమిటీ నాయకుడు మిస్క క్రిష్ణయ్య, డీటీఎఫ్ నాయకుడు కె.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
థర్మల్ కుంపటి మాకొద్దు
Published Mon, Mar 9 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement