పుష్పయాగానికి అంకురార్పణ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామికి పుష్పయాగం చేసేందుకు గురువారం అంకురార్పణ చేశారు. ఆలయం నుంచి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలోని వసంత మండపానికి తీసుకెళ్లి పుట్టమన్ను సేకరించి ఆలయానికి తీసుకొచ్చి అంకురార్పణ పూజలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
శ్రీవారి దర్శనానికి 9 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 32,983 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటలు శ్రీవారి దర్శనం లభిస్తోంది. గురువారం హుండీ ద్వారా శ్రీవారికి రూ.1.95 కోట్ల ఆదాయం లభించింది.
4న కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా నవంబర్ 4న తిరుమల ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొలిపే పర్వదినంగా భావించే దీన్ని ప్రభోదోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. ఆషాడ శుక్ల ఏకాదశి నాడు గాఢనిద్రలోకి వెళ్లిన మహా విష్ణువు కైశిక ద్వాదశి రోజు మేల్కొంటారని భక్తుల నమ్మకం.
శ్రీవారికి అజ్ఞాత భక్తుడి రూ.1.15 కోట్ల విరాళం
తిరుమల శ్రీవారికి గురువారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.15 కోట్లు విరాళం ఇచ్చారు. తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త టీటీడీ ప్రాణదాన ట్రస్టు కోసం రూ.1 కోటి, ఆరోగ్య వరప్రసాద ట్రస్టు కోసం రూ.15 లక్షలు ఇచ్చారు. ఈ విరాళాలను దాతల విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి డీడీల రూపంలో అందజేశారు.
శ్రీవారికి 5 కిలోల వెండి పాదుకలు కానుక
తిరుమల శ్రీవారికి ఐదు కిలోల వెండి పాదుకలు సమర్పించినట్టు గురువారం అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. మునిమనుమరాలికి పుట్టు వెంట్రుకలు చెల్లించి కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండెజబ్బు మరణాలు తగ్గిం చేందుకు అపోలో ఆస్పత్రులు కృషి చేస్తున్నాయన్నారు. త్వరలో నెల్లూరులో భారీ ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.