తిరుపతి: తిరుమలలో (ttd) శ్రీవారి భక్తుల రద్ది తగ్గింది. ఆదివారం స్వామివారిని 66,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,647 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లను భక్తులు కానుకలుగా సమర్పిచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంటులో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి సుమారు 9 గంటల సమయం పట్టనుంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 4 గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనున్నట్లు సమాచారం.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (koil alwar thirumanjanam) జరగనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ ఆలయం శుద్ది చెయనుంది. రేపు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేసిన ఆలయ అధికారులు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే...తమిళంలో కోయిల్ అంటే కోవెల (గుడి) అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.
మహాయజ్ఞం .. తిరుమంజనం
క్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు.
ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఆలయ ప్రాకారాలకు లేపనం
నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారుచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా సంవత్సరంలొ నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్ధానం, బ్రహ్మొత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేయబడినది.
Comments
Please login to add a commentAdd a comment