'పిలుస్తుంటే రావడం లేదు.. ఏం బలుపా'
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుకుంది. బాలుర హాస్టల్‌లోని డి-బ్లాక్‌లో సోమవారం ర్యాగింగ్ చోటుచేసుకుంది. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ‘ఏంటి గెట్‌క్లాస్‌లకు వారం నుంచి పిలుస్తుంటే రావడం లేదు. ఏం బలుపా’ అని ఒక సీనియర్ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏంటి సీనియర్లకు విష్ చేయడం లేదు’ ‘మీకు క్యాంపస్‌లో ఉండాలని లేదా’ అంటూ మరో సీనియర్ హుకుం జారీ చేశాడు. ఎంబీఏ అయ్యాక ఏమి చేస్తావని సీనియర్ అడిగిన ప్రశ్నకు మొక్కల బిజినెస్ అని చెప్పిన జూనియర్‌ను క్యాంపస్‌లో ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కించాలని ఆర్డర్ వేశారు.
మందుల వ్యాపారం అని చెప్పిన వారికి క్యాంపస్‌లో ఎంతమందికి రోగాలున్నాయో కనుక్కొని చెప్పాలని’ హుకుం జారీ చేశారు. సినిమా అంటే ఇష్టమని చెప్పిన వారితో డ్యాన్స్ చేయించారు. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఎస్వీయూ లో గతనెల 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కొత్తగా చేరిన వారికి తరగతులు మొదలయ్యాయి. డి-బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో జూనియర్లకు, మొదటిఫ్లోర్‌లో సీనియర్లకు గదులు కేటాయించారు.
కొత్త విద్యార్థులు వచ్చాక ర్యాగింగ్ జరిగే అవకాశమున్నా నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు, రాత్రి 8 నుంచి 2 గంటల వరకు సీనియర్ విద్యార్థులు తమ గదులకు పిలిపించుకుని ఇంటరాక్షన్ పేరిట వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు కొందరు జూనియర్లు సాక్షికి తెలియజేశారు.
జూనియర్ల సమావేశం:
సీనియర్ల ఆగడాలతో మనస్తాపానికి గురైన జూనియర్లు ఎస్వీయూలో ఆడిటోరియం వద్ద సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సీనియర్లు పెడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా చర్చించారు. మరో రెండు రోజులు చూసి సీనియర్ల ప్రవర్తన మారకపోతే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే బ్లాక్‌లో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.