భారతీయ రైల్వేలో ఉద్యోగం ఒక వరం. అలాంటి ఉద్యోగం చేసే వారు సంస్థ అందజేస్తున్న ఉచిత ప్రయాణం పాసును దొడ్డిదారిన ఎక్కువసార్లు వినియోగించుకొని రైల్వే ఆదాయానికి భారీ గండికొట్టారు. పాసుతో ఒకసారి రిజర్వేషన్ ప్రయాణం చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది సహకారంతో అనేకమార్లు ప్రయాణం చేసిన వ్యవహారాన్ని కాగ్ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారం రైల్వే వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట: రైల్వే పాసులను కొందరు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు విచ్చలవిడిగా వాడేసుకున్న వ్యవహారాన్ని కంపోŠట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తప్పుపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 31న కాగ్ నివేదిక అందజేసింది. ఈ నివేదిక మేరకు జిల్లాలో నందలూరు, కడప, పలు రైల్వే కేంద్రాలల్లో పనిచేసిన సిబ్బంది పాసులను అడ్డగోలుగా వినియోగించుకొని ప్రయాణాలు సాగించారు. ప్రధానంగా ఈ వ్యవహారంలో రైల్వే రిజర్వేషన్ల కేంద్రాలలో పనిచేసే కమర్షియల్ విభాగానికి సంబంధించిన సిబ్బంది సహకారం ఉందనే అనుమానాలపై విచారణ జరిగింది. పాసులను దుర్వినియోగం చేసిన వ్యవహారాన్ని రైల్వేశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అలాంటి వారిని ఇప్పటికే గుర్తించి శాఖాపరమైన చర్యలకు దిగనుంది.
పాసు సదుపాయాలు ఇలా..
రైల్వేశాఖలో పనిచేసే వారికి పాసు సదుపాయం ఉంది. ఉచిత పాసులతో ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. రాజధాని, శతాబ్ది వంటి ప్రఖ్యాత ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు శాఖాపరమైన వెసులుబాటు కూడా ఉంది. రైల్వేపాస్ నిబంధనల మేరకు రైల్వే ఉద్యోగికి ఇచ్చే ఉచిత పాసు కాల వ్యవధి ఐదు మాసాలు ఉంటుంది. పాసు ఇచ్చే తేది నుంచి తాను రా>యించుకున్న మార్గంలో ఒక్కసారి మాత్రమే కుటుంబ సమేతంగా వెళ్లి రావాల్సి ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువసార్లు రిజర్వేషన్లు..
రైల్వే ఉద్యోగులు కొందరు రిజర్వేషన్ సిబ్బంది సహకారంతో ఒకటి కంటే ఎక్కువ అనేక మార్లు రిజర్వేషన్లు చేయించుకున్నారు. కాని ఒకసారి పాస్‌ను రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణం చేస్తే , ఆ పాసు రద్దవుతుంది. కానీ పాసు ద్వారా రిజర్వేషన్ చేశాక విధి నిర్వహణలో ఉన్న క్లర్క్ (కమర్షియల్ ఉద్యోగి)పాసుపై రిజర్వేషన్ వివరాలు నమోదు చేసి, సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులతో కుమ్మక్కై పాసుల వివరాలు నమోదు చేయకపోవడం, సంతకం లేకపోవడం వల్ల అదే పాసుపై ప్రయాణాలు సాగించినట్లు కాగ్ గుర్తించింది. దీని వల్ల రైల్వే ఆదాయానికి భారీ గండిపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాసుల విషయంలో టీటీఈల నిర్లక్ష్యం..
రిజర్వేషన్ చేయించుకున్న రైల్వే సిబ్బంది రైలు ప్రయాణంలో విధుల్లో ఉన్న టీటీఈల నిర్లక్ష్యం మూలంగా అదే పాసుపై అనేకమార్లు తిరగడానికి దోహదపడిందనే విమర్శలున్నాయి. చెకింగ్ చేసే టీసీలు, టీటీఈలు పాసులను తనిఖీ చేసి నిర్ధారించిన తర్వాత సంతకం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారనే అపవాదును మూటగట్టుకున్నారు. కాగ్ ఇచ్చిన నివేదికలో పాసుల దుర్వినియోగం బయటపడటంతో రైల్వే ఉన్నతవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పాసు దుర్వినియోగానికి ఉదాహరణలు..
పాసులను అనేకమార్లు వినియోగించుకున్న దరిమిలా కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. 21805 నెంబరు గల పాసు రెండు పర్యాయాలు, 109601 పాసుపై నాలుగు పర్యాయాలు, 349126 పాసు మీద 16 పర్యాయాలు, 19048 పాసుపై ఏడుమార్లు 79177 పాసు మీద 30 మార్లు, 141105 నంబరుగల పాసులో 8 మార్లు ప్రయాణాలు సాగించినట్లు కాగ్ గుర్తించింది. ఇప్పటికే పాసులు దుర్వినియోగం చేసిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు.
అక్రమార్కులు ఉన్నతశ్రేణి ఉద్యోగులే..
తమకు ఇచ్చిన పాసులను అనేకమార్లు అక్రమ మార్గంలో వినియోగించుకున్న వారిలో కొందరు ఉన్నతశ్రేణి ఉద్యోగులనేది తేలిపోయింది. గెజిటెడ్ హోదాల్లో ఉంటూ సీనియర్ సబార్డినేట్ హోదాల్లో పనిచేస్తూ నెలకు వేలాది రూపాయలు వేతనాలుగా తీసుకునే వారు అడ్డగోలుగా పాసులను దుర్వినియోగం చేసి, మాతృ సంస్థ ఆదాయానికి గండికొట్టారు. రైలు రిజ్వరేషన్ సకాలంలో దక్కక అల్లాడి పోతున్న రైలు ప్రయాణికులు ఈ చర్యలను తీవ్రంగా ఎండగడుతున్నారు.
పాసులు వాడుకుందిలా...
2017–2018 ఆర్థిక సంవత్సరంలో 62 ఉచిత (ప్రివిలేచ్) పాసులకు సంబంధించి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కడప, నందలూరు, తిరుపతి, గుంతకల్లు తదితర ప్రాంతాలకు చెందిన 58 మంది ఉద్యోగులు 441 మార్లు వివిధ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్‌క్లాస్ బోగీలలో రిజర్వేషన్లు చేసి పాసులను దుర్వినియోగం చేశారని కాగ్ నివేదిక పేర్కొన్నట్లు రైల్వే వర్గాల సమాచారం. 62 పాసులలో ఒక్కో ఉద్యోగి కనిష్టంగా ఒకసారి మొదలు గరిష్టంగా 30 పర్యాయాల చొప్పున రిజర్వేషన్లు చేయించుకున్నట్లు కాగ్ పసిగట్టింది.
Comments
Please login to add a commentAdd a comment