వజ్రపుకొత్తూరు: సంక్రాంతి పండగ సమీపిస్తోంది. పల్లెల్లో కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు... డూడూ బసవన్నల నృత్యాలు.. గంగిరెద్దులోళ్ల సన్నాయి మేళాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రానున్న సంక్రాంతి పండుగ సెలవుల్లో ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. నెల రోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్లు పూర్తి కావడం, రిగ్రిట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్‌తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ అదనపు చార్జీల మోత మోగిస్తుండటంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నాయి. రైల్వే శాఖ ఆదీనంలోని ఐఆర్‌సీటీసీ రైళ్లలో సైతం ప్రత్యేక బాదుడు ఉండటంతో ప్రయాణికులకు సంక్రాంతి ప్రయాణం భారమైంది.
అదనపు బోగీలకు శఠగోపం...
సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటి వరకు అదనపు బోగీల ఏర్పాటు యోచన నేటి వరకు చేయలేదు. దీంతో ప్రయాణికులు తమ ఆశలు వదులుకున్నారు. రెండేళ్ల కిందట ప్రత్యేక రైళ్లు నడిపి అదనంగా వసూళ్లు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రయాణికులు గుర్తు చేసకుంటూ... ప్రీమియం రైళ్లలో రోజు రోజుకూ టికెట్ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరికదా ఆర్టీసీ బస్సుల్లో వెళ్దామంటే సంబంధిత అధికారులు రిజర్వేషన్ సైట్లను నిలిపివేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అదనపు చార్జీల మోత తప్పడం లేదు. సాధారణ రోజుల్లో రైల్వే చార్జీల కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువకాగా, పండగ రోజుల్లో డిమాండ్‌ను బట్టీ రెండు నుంచి మూడు రెట్లు వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ మరింద దారుణంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 30 శాతం వరకు రేట్లను పెంచేసిన యాజమాన్యాలు సంక్రాంతి తర్వాత మరో వారం రోజులపాటు టికెట్ ధరపై రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఏటా ఇదే తరహాలో ప్రయాణికులను ప్రైవేటు, రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. అయితే ఆర్టీసీ ఇటీవల చార్జీలు పెంచినందున అదనపు బాదుడుపై ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రిజర్వేషన్‌పై వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కావాలన్నా దొరక్కపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఆరీ్టసీ, రైల్వే శాఖ అధికారులు దృష్టి సారించి రద్దీ మేరకు ట్రైన్, బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment