రాజాం.. 2009లో ఏర్పడిన నియోజకవర్గం. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి వైఎస్సార్ ప్రభంజనం కనిపించగా.. 2014లో వైఎస్సార్‌సీపీ హవా కనిపించింది. ముచ్చటగా మూడోసారి వైఎస్సార్‌సీపీ తరఫున కంబాల జోగులు, టీడీపీ తరఫున కోండ్రు మురళీమోహన్ యుద్ధానికి సిద్ధమయ్యారు. అభ్యర్థులిద్దరూ రాజకీయంగా అనుభవం కలిగిన వారు కావడం, ఎత్తుకు పై ఎత్తులు వేయగల సమర్థులు కావడంతో రాజాం రాజకీయం రసవత్తరంగా మారింది. సిటింగ్ ఎమ్మెల్యేగా కంబాల అన్ని వర్గాల ప్రేమను సంపాదించగలిగారు. అయితే ప్రతిభాభారతిని కాదని కోండ్రుకు టికెట్ ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి రేగుతోంది. ఈ జ్వాలలు ఎవరిని బలి చేస్తాయో చూడాలి మరి.
ఉణుకూరు నుంచి రాజాంగా..
రాజాం నియోజకవర్గం ఏర్పడకముందు ఇక్కడ ఉణుకూరు నియోజకవర్గం ఉండేది. 1952 నుంచి 2004 వరకూ ఈ నియోజకవర్గం కొనసాగింది. జనరల్ కేటగిరీగా ఉండేది. పాలవలస రాజశేఖరం, కిమిడి కళా వెంకటరావు కుటుంబాల మధ్య ఇక్కడ పోటీ ఉండేది. రాజాం, వంగర మండలాలతో పాటు రేగిడి మండలంలోని 19 పంచాయతీలు గతంలో ఉణుకూరు నియోజకవర్గంలో ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలతో రాజాం నియోజకవర్గం ఏర్పడింది. ఈ కొత్త నియోజకవర్గంలో రెండు పర్యాయాలు వైఎస్సార్ అభిమానులే విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం తలపడుతున్న కంబాల, కోండ్రులు ఇక్కడ పాత ప్రత్యర్థులే. 2009లో ముఖాముఖి తలపడ్డారు. 2014కు వచ్చే సరికి కోండ్రు తలపడినా అసలు రేసులోనే లేకుండాపోయారు. కావలి, కంబాల మధ్యనే పోటీ జరగ్గా కంబాలకు జనాల అభిమానం దక్కింది.
ప్రతిభా భారతికి షాక్..
మహిళలకు ప్రాధాన్యమిస్తామని తరచూ చెప్పే చంద్రబాబు రాజాం నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ప్రతిభాభారతికి షాక్ ఇచ్చారు. దశాబ్ధాలుగా ఇక్కడ టీడీపీని ప్రతిభాభారతి బతికించారు. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన కోండ్రు మురళీమోహన్‌కు టికెట్ ఇచ్చి ప్రతిభాభారతిని పక్కన పెట్టడం ఆమెను విస్మయానికి గురిచేసింది. స్థానిక కార్యకర్తలకు కూడా ఈ నిర్ణయం మింగుడుపడడం లేదు. ప్రతిభాభారతి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని కావలి కావడం విశేషం. స్థానికతను కూడా పక్కనపెట్టి కోండ్రు టికెట్ కేటాయించడంతో టీడీపీ కార్యకర్తల్లో కూడా ఆందోళన అధికమైంది.
జనం మనిషి ‘కంబాల’
ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కంబాల జోగులు జనం మనిషిగా గుర్తింపు పొందారు. 2014లో ప్రతిభాభారతిపై విజయ బావుటా ఎగురవేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీగా ఉండి జగన్ వెనుకే నిలబడ్డారు. ఆ నిబద్ధతే ఆయనకు జనానికి మరింత దగ్గర చేసింది. స్థానికంగా వైఎస్సార్ అభిమానులు భారీగా ఉండడం కూడా ఆయనకు కలిసివస్తోంది. మరోవైపు కోండ్రు మురళీమోహన్ స్థానికంగా సత్తా చాటి చాలారోజులైపోయింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత అసలు రాజాం ప్రాంతంలో ఆయన కనిపించనేలేదు. హఠాత్తుగా ఎన్నికల సమయంలో ప్రత్యక్షమవడం, టికెట్ కూడా దక్కడం స్థానికులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆయన రాకతో టీడీపీలో చీలికలు వచ్చాయన్నది బహిరంగ సత్యం. ప్రతిభాభారతి వంటి సీనియర్ నాయకురాలిని కాదని ఆయనకు టికెట్ ఇవ్వడం దారుణమని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ గుర్తులు
రాజాంలో ప్రసిద్ధమైన మడ్డువలస ప్రాజెక్టు వంగర మండలంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి హోదాలో డా క్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. 67 కోట్లు మేర Ðవెచ్చించి అభివృద్ధి చేశా రు. గొర్లె శ్రీరాములునాయుడు పేరును ప్రాజెక్ట్‌కు పెట్టారు. నిర్వాసితులకు బకాయి బిల్లులు చెల్లించి ఆదుకున్నారు. అంతేకాకుండా తోటపల్లి కాలువ నీటిని రాజాం ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇంకోవైపు 1960లో కట్టిన నారాయణపురం ఆనకట్ట నాగావళి నదిపై సంతకవిటి మండలంలో ఉంది. మడ్డువలస, నారాయణపురం, తోటపల్లి ప్రధాన సాగునీటి వనరులు. ఈ కాలువలు పరిధిలో మొత్తం 50 వేల ఎకరాలు సాగు నియోజకవర్గంలో ఉంది. సుప్రసిద్ధ సీతారాములు ఆలయం సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో ఉంది. తాండ్ర పాపారాయుని నివాసం రాజాంలో ఉంది. ఇక్కడ ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం ఈ గదిలోనే నడుస్తోంది. రాజాం ప్రస్తుతం విజయగనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది.
మొత్తం ఓటర్లు :2,09,646
పురుషులు :1,06,663
స్త్రీలు :1,02,950
Comments
Please login to add a commentAdd a comment