రాజాం: ఆయన జిల్లాకు మంత్రి. వాస్తవంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. ఆయన చేస్తున్నది చూస్తే పూర్తి భిన్నం. తమ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం వైద్యశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా ఓ మత్తు వైద్యుడి డిప్యుటేషన్ రద్దు చేయించారు. తమ ఆస్పత్రిలో నియమించుకున్నారు. ఫలితం రాజాంలోని వందపడకల ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రాజాం, విజయనగరంలోని పలు మండలాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే... కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో పనిచేస్తున్న మత్తు వైద్యుడు జి.చంద్రమౌళి గత కొద్ది నెలలుగా రాజాం వంద పడకల ఆస్పత్రిలో డిప్యుటేషన్ ప్రాతిపదికన వారంలో మూడు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో శస్త్రచికిత్సలు సాఫీగా సాగిపోయేవి. అయితే, మంత్రి అచ్చెన్న తన అధికార బలంతో మత్తువైద్యుడికి రాజాంలో డిప్యుటేషన్ రద్దు చేయించడమే కాకుండా తన సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి ప్రాం తీయ ఆస్పత్రిలో రెండు రోజుల కిందట నియమించుకున్నారు. దీంతో ఇక్కడ శస్త్రచికిత్సలు నిలిచిపోయూయి.
ఆస్పత్రికి వచ్చే రోగులను శ్రీకాకుళం రిమ్స్, విశాఖ కేజీహెచ్ వంటి ఆస్పత్రులకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మత్తు వైద్య నిపుణుడు చంద్రమౌళి డిప్యుటేషన్ రద్దు విషయం వాస్తవమేనని రాజాం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గార రవిప్రసాద్ తెలి పారు. శస్త్రచికిత్సలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. మత్తువైద్యుడి డిప్యుటేషన్ రద్దులో మంత్రి తీరును స్థానికులు తప్పుబడుతున్నారు. తక్షణమే వైద్యుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజాం ఆస్పత్రిలో నిలిచిన శస్త్రచికిత్సలు
Published Tue, Nov 11 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement