ఇన్‌సెట్‌లో ఏసీబీకి దొరికిపోయిన పోలీసులు
పీఎంపాలెం (భీమిలి): మన రాష్ట్ర పోలీసులు.. వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళ్లారు.. అక్కడ వారి ఆచూకీ కనిపెట్టారు. దొంగలు దొరకగానే పట్టుకోవాల్సింది పోయి పోలీసులు వారితో లాలూచీ పడ్డారు. లంచమిస్తే వదిలేస్తామన్నారు. ఇంకేముంది.. దొంగలు కూడా పోలీసులు అడిగినదానికి ఆనందంగా తలలూపారు. ఇంతలోనే ఊహించని విధంగా ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు అక్కడ మాటు వేసి లంచం తీసుకుంటున్న మన రాష్ట్ర పోలీసుల్ని అరెస్ట్ చేశారు. ఇలా దొంగల్ని పట్టుకుందామని వెళ్లి పోలీసులే అరెస్ట్ అయిన సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దొంగల ముఠా నుంచి రూ.1.40 లక్షలను లంచంగా తీసుకుంటూ అక్కడి ఏసీబీ అధికారులకు సోమవారం విశాఖపట్నం పోలీసులు పట్టుబడ్డారు.
రాజస్థాన్‌లోని బాలే జిల్లా దింగ్మా ప్రాంతానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి పీఎంపాలెం హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉండేవాడు. ఈ ఏడాది ఆగస్టు 29న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెంకటరమణ అనే నగల వ్యాపారిని బంగారం వ్యాపారం పేరుతో ఇక్కడకు పిలిపించి తాళ్లతో కట్టేసి 3 కిలోల బంగారు ఆభరణాలతో పారిపోయాడు. రాకేశ్‌తోపాటు ఈ దోపిడీ ముఠాలో రాజస్థాన్‌కే చెందిన హీరాలాల్, రాము, ఛత్తీస్‌గఢ్‌లోని కిసాన్‌గంజ్‌కి చెందిన హిమ్మత్ పటేల్, రమేశ్ పటేల్, అగృత పటేల్ ఉన్నట్టు గుర్తించి రెండు బృందాలుగా గాలించినా ప్రయోజనం దక్కలేదు. అయితే ఇటీవల పీఎంపాలెంకు చెందిన జిలేబీ వ్యాపారి సంతోశ్ సెల్‌ఫోన్‌లో ముఠా సభ్యుల నంబర్లు ఉండటంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంతోశ్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా సభ్యులను పట్టుకోవడానికి నార్త్ సబ్ డివిజన్ (పీఎంపాలెం) క్రైమ్ సీఐ సి.వి.ఆర్.కె.చౌదరి, పరవాడ ఎస్‌ఐ ఎస్.కె.షరీఫ్, మహరాణిపేట ఎస్‌ఐ గోపాలరావు, వన్‌టౌన్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌లను పంపించారు. అయితే అక్కడ ముఠా సభ్యుల నుంచి లంచం తీసుకుంటుండగా రాజస్థాన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment