![‘ఫైన్’గా దోపిడీ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81406583451_625x300.jpg.webp?itok=SBviCq5R)
‘ఫైన్’గా దోపిడీ!
రామారావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. భార్య భోజనం వడ్డించింది. ప్లేట్లో అన్నం కలపడానికి ప్రయత్నించగా ముద్దముద్దగా తగిలింది. అన్నం ఇలా ఉందేటి... ఈ వండటమేంటి?.. అంటూ భార్యపై చిందులేశాడు. అరే.. నాపై చిందులేస్తారేంటండీ.. సూపర్‌ఫైన్ బియ్యమంటూ తెచ్చింది మీరే కదా?.. అప్పటికీ నీళ్లు తక్కువ వేసి వండాను. అయినా ఇలా అయ్యింది. నన్నేం చేయమంటారు?!.. అంటూ ఆవిడ కూడా అదేస్థాయిలో సమాధానమిచ్చింది. అంతే బిత్తరపోయిన రామారావు మౌనం వహించాడు.. కుటుంబాల్లో ఇలాంటి కలహాలకు బియ్యం పేరుతో జరుగుతున్న దోపిడీ కారణమవుతోంది.
శ్రీకాకుళం అగ్రికల్చర్:జిల్లాలో పలువురు వ్యాపారులు సూపర్ ఫైన్, ఫైన్ రకం పేరుతో నాసిరకం బియ్యం అంటగటుతుండటంతో ప్రజలు మోసపోతున్నారు. కొందరు వ్యాపారులు, మిల్లర్లు ధనార్జనే ధ్యేయంగా రేషన్ బియ్యా న్ని పాలిష్ చేసి ఫైన్ రకంగా కనిపించేం దుకు కొన్ని రకాల పౌడర్లు, ఆయిల్ వాడి.. సూపర్ ఫైన్ రకం అని పేరుపెట్టి విక్రయిస్తున్నారు. అయితే వీటిలో కొంతమేరకు పాత బియ్యం, ఫైన్ రకం బియ్యం కల్తీ చేయడంతో వండిన అన్నం ముద్ద అయిపోతోంది. బియ్యం నాణ్యత, రకాలపై పెద్దగా అవగాహన లేని వినియోగాదారులు ఈ మాయలో పడి మోసపోతున్నారు. మరోవైపు భోజన హోటళ్లలో చాలా వరకు ఈ బియ్యాన్నే వినియోగిస్తున్నారు.
గత క్టోబర్‌లో కురిసిన వర్షాలతో ఖరీప్‌లో దిగుబడి బాగా తగ్గింది. దీనికి తోడు ఫైన్ రకం ధాన్యం ధరలు కూడా అధికం. దీంతో మిల్లర్లు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు. రేషన్‌బియ్యం, దొడ్డ రకాలను పాలిష్ పట్టించి ఫైన్ రకంగా మార్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో సన్న బియ్యం వాడేవారి సంఖ్య 15 లక్షలకు పైగా ఉంది. దాంతో రేషన్ షాపులో కొన్న బియ్యంలో అల్పాహారాల(ఇడ్లీ, దోసె, పొంగల్, వడియాలు ఇతరత్రా) తయారీకి వాడుకోగా మిగిలిన వాటిని స్థానిక వ్యాపారుల సహకారంతో తిరిగి మిల్లర్లకే అమ్ముతున్నారు. అన్నం కోసం మాత్రం సన్న బియ్యాన్ని మార్కెట్‌లో కొనుక్కుంటున్నారు. సన్న బియ్యాన్ని డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. జిల్లాలో తగినంత పంట లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు నాసి రకం బియ్యాన్నే సన్న రకాలుగా చెలామణీ చేస్తున్నారు.
మార్చేది ఇలా..
కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని స్థానికంగా ఉండే వ్యాపారులు కిలో రూ. 10 రేటుకు కొనుగోలు చేస్తారు. దాన్ని మిల్లర్లకు కిలో రూ. 17కు విక్రయిస్తారు. ఆ బియ్యాన్ని మిల్లర్లు రకరకాల పౌడర్లు, ఆయిల్స్‌తో పాలిష్ పట్టించి సన్న బియ్యం అనిపించేలా మెరుగులు దిద్దుతారు. వీటిని మార్కెట్ పరిస్థితులను బట్టి కిలో రూ. 25 నుంచి 35 మధ్య విక్రయిస్తున్నారు. మరికొందరు పాలిష్ చేసిన ఈ బియ్యంలోనే కొంత మోతాదులో ఫైన్ బియ్యాన్ని కలిపి సూపర్ ఫైన్‌గా మారుస్తున్నారు. దీన్ని కిలో రూ. 45 వరకు విక్రయిస్తున్నారు. అధికారుల నిఘా లేకపోవడంతో ఈ ఘరానా మోసం దర్జాగా సాగిపోతోంది.