సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాలతో మండల పరిధిలోని రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం మరమ్మత్తులకు రూ.80 లక్షలతో అంచనాలు వేసి నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదించనున్నామని ఎత్తిపోతల పథకం డీఈఈ ఎన్.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ ఎత్తిపోతల పథకంతోపాటు పలు పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం తాళాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండడం వాస్తవమేనన్నారు. వీటిని తీసుకుని పథకం చక్కగా నిర్వహిస్తున్న రైతులకు అప్పజెప్పనున్నామన్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం ఈఈ లక్ష్మీపతితోపాటు పలువురు అధికారులతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారన్నారు.
పథకం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. ఈ పథకం సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 250 ఎకరాలకు మాత్రమే అందిస్తుందని డీఈఈ తెలిపారు. 150 హెచ్‌పీ గల రెండు మోటార్లలో ఒకటి మాత్రమే (75 హెచ్‌పీ) పని చేస్తుందన్నారు. వీటి మరమ్మతులతోపాటు పైపులైన్‌లు కూడా బాగుస్తామన్నారు. గతంలో ఆర్‌సీసీ పైపులు ఉండేవని వీటి స్థానంలో పీసీఎస్ పైపులు వాడనున్నామన్నారు. పంపు హౌస్ నుంచి సుమారు 100 మీటర్లు దాటిన తరువాత పైపులైన్‌లు మరమ్మతులకు గురైనట్లు తెలిపారు. ఏఈలు, రైతులు పాల్గొన్నారు.
అధికారులు, రైతులతో మాట్లాడుతున్న డీఈఈ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment