రంజుగా సాగిన రంజీ | Ranji trophy | Sakshi
Sakshi News home page

రంజుగా సాగిన రంజీ

Published Wed, Jan 14 2015 9:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

Ranji trophy

జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండులో ప్రారంభమైన మొట్టమొదటి రంజీ మ్యాచ్‌లో తొలిరోజైన మంగళవారం బౌలర్ల దూకుడుతో ప్రారంభమయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి త్రిపుర జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు కుప్పకూలగా, ఆంధ్రా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది.

ఒంగోలు : ఆంధ్రా-త్రిపుర జట్ల మధ్య స్థానిక ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో మంగళవారం ప్రారంభమైన మొట్టమొదటి రంజీ మ్యాచ్‌లో బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్రా బౌలర్ శివరాం ధాటికి త్రిపుర టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలిరోజు మొత్తం 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమే బౌండరీకి తరలాయి. వీటిలో త్రిపుర జట్టువి 16 బౌండరీలు కాగా ఆంధ్రా జట్టువి 5 ఉన్నాయి. త్రిపుర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఆంధ్రా జట్టు.. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందని గుర్తించి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఆంధ్రా జట్టు ఊహించినట్లే తొలి సెషన్‌లో త్రిపుర జట్టు వికెట్లు టపటపా కూలాయి. త్రిపుర కేవలం 83 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ ఎనిమిది మందిలో ఆర్‌కే సోలంకి 39 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. ఆదుకుంటాడని భావించిన త్రిపుర కెప్టెన్ ఆర్‌డీ బానిక్ 9 బంతులాడి ఒక బౌండరీ మాత్రమే చేశాడు. ఆంధ్రా బౌలర్ శివకుమార్ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో త్రిపుర జట్టు తీవ్ర నిరాశకు లోనైంది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టడంతో ఒక దశలో లంచ్ సమయానికే త్రిపుర తొలి ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు. టెయిలెండర్ రాణా దుత్తా జాగ్రత్తగా ఆడుతూ ఆంధ్రా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తం 64 బంతులు ఆడి 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆంధ్రా జట్టు క్రీడాకారులు 5 లెగ్‌బైస్, ఆరు నోబాల్స్‌తో మొత్తం 11 పరుగులు అదనంగా ఇచ్చారు. ఆంధ్రా కెప్టెన్ మహ్మద్ కైఫ్ తొలి స్లిప్‌లో ఉండి రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో కైఫ్ ...కైఫ్ అంటూ అభిమానులు పెద్దపెట్టున అరిచారు. లంచ్ తర్వాత త్రిపుర తొలి ఇన్నింగ్స్ ముగియడంతో ఆంధ్రా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. త్రిపుర జట్టు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో ఒక దశలో ఆంధ్రా జట్టు ఎదురీదుతుందన్న భావన కనిపించింది. అయితే కెప్టెన్ కైఫ్ జాగ్రత్తగా ఆడుతూ కేవలం సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీస్తూ స్కోరు బోర్డు పెంచాడు. తొలి ఓవర్ రెండోబంతికే ఆంద్రా జట్టు ఓపెనర్ కేఎస్ భరత్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన డీబీ ప్రశాంత్‌కుమార్ కూడా కేవలం 8 బంతులు ఎదుర్కొని 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అనంతరం వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన ఎంయూబీ శ్రీరాం 37 బంతులు ఎదుర్కొని 4 బౌండరీల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన కైఫ్ 82 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏజీ ప్రదీప్ 12 పరుగులకు ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రికీ భుయి 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement