హిమతేజ, తనయ్ అర్ధశతకాలు
పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్ 24/2
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసి కట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు.
ఓవర్‌నైట్ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు తన్మయ్, రోహిత్ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (27), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ విఫలమైనా... ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 3, సతీశ్ రెండు వికెట్లు పడగొట్టారు.
కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్ రాజు (19), సాగర్ (0) అవుట్ కాగా... వికెట్ కీపర్ అజయ్ రొహెరా (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) (సబ్) విఘ్నేశ్వరన్ (బి) అంకిత్ శర్మ 173; అభిరత్ రెడ్డి (సి) అరుణ్ కార్తీక్ (బి) సాగర్ 68; రోహిత్ రాయుడు (బి) ఫాబిద్ అహ్మద్ 84; హిమతేజ (సి) అమన్ (బి) సతీశ్ 60; రాహుల్ సింగ్ (సి) గంగ శ్రీధర్ రాజు (బి)గౌరవ్ యాదవ్ 27; రాహుల్ రాధేశ్ (సి అండ్ బి) అంకిత్ శర్మ 24; చామా మిలింద్ (బి) సతీశ్ 7; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 53; అనికేత్ రెడ్డి (బి) అంకిత్ శర్మ 12; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్) 536.
వికెట్ల పతనం: 1–111, 2–231, 3–345, 4–397, 5–440, 6–458, 7–460, 8–486. బౌలింగ్: గౌరవ్ యాదవ్ 35–9–102–1; సాగర్ 31–5–98–1; ఫాబిద్ అహ్మద్ 30–6–78–1; అమన్ ఖాన్ 11–1–55–0; అంకిత్ శర్మ 35–1–117–3, సతీశ్ 20–2–72–2.
Comments
Please login to add a commentAdd a comment