నరసాపురం అర్బన్ : అరుదైన వ్యాధి కబళిస్తోంది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉంది. బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఇప్పుడా తల్లిదండ్రులకు అంతులేని మనోవేదన మొదలైంది. మోకావారిపాలేనికి చెందిన 11 ఏళ్ల వాతాడి అంకిత్ (దుర్గారావు) అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని వైద్యం నిమిత్తం ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించిన తల్లిదండ్రులు ఇక ఏమీ చేయలేని స్థితిలో దాతల సాయం అర్ధిస్తున్నారు. వాతాడి వెంకట నారాయణ, కనకదుర్గ దంపతుల కుమారుడు దుర్గారావు పుట్టినప్పటి నుంచి కాన్‌జంషియల్ హైడ్రినల్ హైప్లైసిస్ (సీఏహెచ్) అనే అరుదైన వ్యాధికి గురయ్యాడు.
ఈ వ్యాధికి సంబంధించి శరీరంలో సోడియం, పొటాషియం, కాల్షియం నిల్వల సమతుల్యత దెబ్బతింటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా శరీరంలో సోడియం శాతం దారుణంగా పడిపోతుంది. దీంతో దుర్గారావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. పదకొండేళ్లుగా తల్లిదండ్రులు ఇతని వైద్యానికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. దుర్గారావుది పేద కుంటుంబం. తండ్రి చిన్న కిళ్లీ కొట్టు నడుపుకొని జీవిస్తున్నాడు. దుర్గారావుకు ముందు వెంకట నారాయణకు ముగ్గురు సంతానం కలిగి ఇదే వ్యాధితో చనిపోయారు. ఉన్న ఏకైక కొడుకునైనా రక్షించుకుందామంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని వారు వాపోతున్నారు. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత చికిత్స లేదు. జీవితాంతం ఇదే రకంగా వైద్యం చేయించాల్సిందే. దీంతో దుర్గారావు తండ్రి నారాయణ దాతల సహాయం కోసం అర్థిస్తున్నారు. సహృదయంతో ముందుకు వచ్చేవారు సెల్ నంబర్ 99635 86997ను సంప్రదించాలని కోరుతున్నారు.
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
Published Tue, Feb 24 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement