కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరో అరుదైన చికిత్స జరిగింది. యేడాది వయస్సున్న పాప శ్వాస నాళంలో ఇరుక్కున్న వేరుశనగ విత్తనాన్ని ఆధునిక పరికరాలతో వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణం పోశారు. కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన రామదాసు, లక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.
చివరి కుమార్తె రెండు రోజుల క్రితం వేరుశనగ విత్తనాన్ని మింగింది. అయితే అది కాస్తా ఆహార నాళంలోకి వెళ్లకుండా శ్వాసనాళంలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు రోజులుగా ఆ చిన్నారి శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడింది. బుధవారం పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వెంటనే ఈఎన్‌టీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.భానుమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ కిశోర్ బ్రాంకోస్కోప్, టెలిస్కోప్ పరికరాలను ఉపయోగించి పాప శ్వాసనాళంలో ఇరుకున్న వేరుశనగ విత్తనాన్ని విజయవంతంగా బయటకు తీశారు.
అనంతరం పాపను చిన్నపిల్లల వార్డులోని పీఐసీయులో అడ్మిట్ చేశారు. ఇలాంటి కేసులను గతంలో హైదరాబాద్‌కు పంపించేవారమని, ఆధునిక పరికరాలు ఉండటంతో ఈ చికిత్స చేయగలిగామని డాక్టర్ ఆర్. భానుమూర్తి చెప్పారు. రెండు నెలల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్ ఈ పరికరాలను ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేశారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులను అడ్మిట్ చేసుకోరని, హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేస్తారన్నారు. ప్రాణాపాయంలో ఉన్న పాపకు ఆధునిక పద్ధతిలో చికిత్స చేసి ప్రాణం పోయడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
చిన్నారికి అరుదైన చికిత్స
Published Thu, Jul 3 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement