groundnut seed
-
బయోమెట్రిక్‌తోనే విత్తన పంపిణీ
– మే రెండో వారంలో వేరుశనగ పంపిణీకి శ్రీకారం అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది మాదిరిగా ఈ సారీ ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ విధానంతోనే విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సారి చౌక దుకాణాలను ఉపయోగించుకుని గ్రామ గ్రామాన పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అయితే.. ఇప్పటికిప్పుడు అలా చేయడం కష్టమని ప్రాథమికంగా తేల్చేశారు. అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గ్రామాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్ట కింద చౌక డిపోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 4.50 లక్షల క్వింటాళ్లు కేటాయింపు ఈ ఖరీఫ్‌లో రాయితీపై 4.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ కమిషనరేట్ నుంచి అనుమతులొచ్చాయి. ఇందులో ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా 3.50 లక్షల క్వింటాళ్లు సేకరించడంతో పాటు ప్రస్తుత రబీలో పండిన పంట ఉత్పత్తులు కనీసం లక్ష క్వింటాళ్లను ఎన్జీవోల ద్వారా సేకరించి మనవిత్తన కేంద్రాల (ఎంవీకే) ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశముంది. అంతలోపే అన్ని మండలాల్లో విత్తనకాయలు సిద్ధం చేసి ఉంచాలని సేకరణ సంస్థలను ఆదేశించారు. ఇప్పటికే ఆ సంస్థలు విత్తనకాయల ప్రాసెసింగ్ మొదలుపెట్టాయి. మే రెండో వారం నుంచి పంపిణీకి ప్రణాళికలు రచించారు. వర్షాలొస్తే జూన్‌లోనే ముందస్తుగా పంట వేసే పరిస్థితి ఉంది. దీంతో జూన్ మొదటి వారానికల్లా పంపిణీ ముగించేయాలని ఆలోచిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే.. రాష్ట్రంలోనే తొలిసారిగా గత ఏడాది జిల్లాలో ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టారు. మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా ఎలాగోలా 3.10 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి ఈ సారి పకడ్బందీగా మండల కేంద్రాల్లో పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అదే చౌకడిపోల ద్వారా అయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామాల్లో గోదాములు, కనీస సదుపాయాలు, బందోబస్తు, తగినంత సిబ్బంది, సర్వర్ కనెక్టివిటీ లాంటి సమస్యలతో పాటు విత్తన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోనే ఇస్తామంటే రైతులందరూ ఒకేసారి వస్తారని, వారికి విత్తనకాయలు సమకూర్చడం కష్టమని అంటున్నారు. -
విత్తన వేరుశనగ ధర ఖరారు
అనంతపురం అగ్రికల్చర్ : రబీ–2016కు సంబంధించి రాయితీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ ధర ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కే–6తో పాటు మిగతా రకాలు కూడా క్వింటా పూర్తీ ధర రూ.6,877 కాగా అందులో 33.33 శాతం సబ్సిడీ రూ.2,292 పోనూ రైతు వాటాగా రూ.4,585 ప్రకారం ఖరారు చేశారు. ఈ రబీలో జిల్లాకు 15 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ కేటాయించినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పంపిణీ చేపడుతామన్నారు. -
వేరుశనగ విత్తనం కోసం రైతుల ఆందోళన
నాసిరకం విత్తనాన్ని తిరస్కరించిన అన్నదాతలు కళ్యాణదుర్గం : వేరుశనగ సబ్సిడీ విత్తనం వెంటనే అందజేయాలని మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా సబ్సిడీ విత్తనం కోసం యార్డులోనే రాత్రింబవళ్ళు నిరీక్షిస్తున్నామని రైతులు వాపోయారు. 60 శాతం సబ్సిడీతో విత్తనోత్పత్తి పథకం కింద విత్తనం కోటా పంపిణీ పూర్తి అయ్యింది. 60 శాతం సబ్సిడీతో ఐదు మండలాలకు 900 కింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేశారు. 30 కిలోల బస్తా రూ.800 ప్రకారం రైతులకు అందజేశామని అధికారులు చెబుతున్నారు. కాగా 33 శాతం సబ్సిడీతో విత్తనం పొందాలంటే 30 కిలోల బస్తాకు రూ.1200 చెల్లించాలని అధికారులు చెబుతున్నారని రైతుల వాపోయారు. నాసిరకం విత్తనాన్ని పంపిణీ చేస్తున్నారని అనంతపురం నుంచి విజేత ఆగ్రోస్సీడ్స్ సంస్థ నుంచి సరఫరా అయిన వంద కింటాళ్లను రైతులు తిరస్కరించారు. కుందుర్పి మండలానికి చెందిన రైతులు విత్తనం కోసం ఏఓ వాసుకిరాణిని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ రైతుల వినతిమేరకు ప్రత్యేక శ్రద్ధతో 33 శాతం సబ్సిడీ విత్తనాన్ని తెప్పించానని తెలిపారు. అయితే రైతులు విత్తనం నాసిరకంగా ఉందని, తీసుకోడానికి నిరాకరించడంతో దానిని వెనక్కు పంపుతున్నామన్నారు. కాగా రైతులు మాట్లాడుతూ 60 శాతం సబ్సిడీతో విత్తనం అందజేయాల్సిందేనని పట్టుపట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. నాణ్యతగల విత్తనం రాగానే 33 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని చెప్పారు. -
చిన్నారికి అరుదైన చికిత్స
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరో అరుదైన చికిత్స జరిగింది. యేడాది వయస్సున్న పాప శ్వాస నాళంలో ఇరుక్కున్న వేరుశనగ విత్తనాన్ని ఆధునిక పరికరాలతో వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణం పోశారు. కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన రామదాసు, లక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చివరి కుమార్తె రెండు రోజుల క్రితం వేరుశనగ విత్తనాన్ని మింగింది. అయితే అది కాస్తా ఆహార నాళంలోకి వెళ్లకుండా శ్వాసనాళంలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు రోజులుగా ఆ చిన్నారి శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడింది. బుధవారం పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వెంటనే ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.భానుమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ కిశోర్ బ్రాంకోస్కోప్, టెలిస్కోప్ పరికరాలను ఉపయోగించి పాప శ్వాసనాళంలో ఇరుకున్న వేరుశనగ విత్తనాన్ని విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం పాపను చిన్నపిల్లల వార్డులోని పీఐసీయులో అడ్మిట్ చేశారు. ఇలాంటి కేసులను గతంలో హైదరాబాద్‌కు పంపించేవారమని, ఆధునిక పరికరాలు ఉండటంతో ఈ చికిత్స చేయగలిగామని డాక్టర్ ఆర్. భానుమూర్తి చెప్పారు. రెండు నెలల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్ ఈ పరికరాలను ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేశారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులను అడ్మిట్ చేసుకోరని, హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేస్తారన్నారు. ప్రాణాపాయంలో ఉన్న పాపకు ఆధునిక పద్ధతిలో చికిత్స చేసి ప్రాణం పోయడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.