
చిన్నపిల్లతో పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి వచ్చిన వారణాసి గౌతమి (ఇన్‌సెట్‌లో) రేషన్ కార్డు
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా పౌర సరఫరాల కార్యాలయం వద్ద చిన్న పిల్లతో పడిగాపులు కాస్తున్న ఫొటోలోని మహిళ పేరు వారణాసి గౌతమి. ఆమెది బొబ్బిలి పట్టణం. వీరి రేషన్ కార్డులో ఆమె భర్త ప్రసాద్ కుమారుడు జయదీప్, కుమార్తె రితక్ష ఉన్నారు. కానీ రేషన్ మాత్రం కేవలం ఇద్దరికే వస్తుంది. తన భర్త ప్రసాద్, కుమారుడు జయదీప్ పేర్లు రెండు నెలలకు పైగా ఆన్‌లైన్లో కనిపించడం లేదని బొబ్బిలిలోని పౌర సరఫరాల కార్యాలయాన్ని సంప్రదిస్తే ప్రసాద్ పేరు చనిపోయినట్టు ఉందని, కుమారుడు జయదీప్ పేరు ఆన్‌లైన్ ఆధార్ లింక్ కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. సరిదిద్దాలని కోరగా ఇక్కడ వీలు కాదనీ, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందేనని చెప్పారు. దీంతో ఆమె ఇక్కడకు వచ్చి సంప్రదించారు.
జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు..
ఇదే సమస్యతో బాధపడుతున్న వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరాల కోసం రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకుంటున్న యంత్రాంగం ఈ పేర్లను మార్పిడి చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. జిల్లాలోని రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లుతున్నా వాటిని సరిదిద్దే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో సరిదిద్దాలంటూ లబ్ధిదారులు పలు మార్లు మండల, జిల్లా కేంద్రాల్లోని పౌర సరఫరాల కార్యాలయాలకు తిరుగుతున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రేషన్‌కార్డే కీలకం..
జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులు సుమారు 18 లక్షల మంది ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా రేషన్‌కార్డు కీలకమవుతుంది. ఆ సమయంలో రేషన్ కార్డు తీసుకువెళితే ఆ కార్డు డెడ్ అయిందనీ, లేదా సభ్యుడు చనిపోయాడనీ, వలస వెళ్లాడనీ, ఆధార్ లింక్ తప్పిందనీ సమాచారం వస్తోంది. దీంతో లబ్ధిదారులు జిల్లా కేంద్రానికే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లబ్ధిదారులు వ్యవప్రయాలకు ఓర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారు.
పట్టించుకోని మండల సిబ్బంది..
జిల్లాలో రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారులు, సిబ్బంది విషయాన్ని వినకుండా నేరుగా డీఎస్‌ఓ కార్యాలయానికి పంపించేస్తున్నారు. దీంతో ఇక్కడకు వచ్చేందుకు లబ్ధిదారులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. ప్రతీ చిన్న పనికి జిల్లా కేంద్రానికి వస్తున్నాం ఇక్కడి వాళ్లమో తిరిగి పంపించేస్తున్నారు. దీంతో తాము అవస్థలు పడుతున్నామని పలువురు లబ్ధిదారులు వివరిస్తున్నారు.
వైద్య సేవలకు విజయవాడ వెళ్లాల్సిందే..!
రేషన్ కార్డుల్లో తప్పిదాల వల్ల చివరకు వైద్య సేవలకూ లబ్ధిదారులు దూరం కావాల్సి వస్తోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాల్లో సేవలు అందుకోలేకపోతున్నారు. కార్డుల్లో పేర్లు చేర్చాలంటే చివరకూ విజయవాడ కాల్‌సెంటర్‌కు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. చిన్న సమస్యలను పరిష్కరించేందుకు అంత దూరం ఎందుకని, మమ్మల్ని ఇబ్బందులు పెట్టేందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉండేటప్పుడు ఇన్ని ఇబ్బందులు లేకుండా వైద్యం అందేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ సెలవులో డీఎస్‌ఓ..
జిల్లా పౌరసరఫరాల అధికారి జె.శాంతికుమారి మళ్లీ సెలవులో వెళ్లారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె వారం రోజుల పాటు సెలవు పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించక లేదు.