చిలకలూరిపేట : రాష్ట్రమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు తన సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంక్షిప్త సందేశాలను పంపిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కేసీ వెంకటయ్య వివరాలను వెల్లడించారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యాపారంలో తలెత్తిన విభేదాల కారణంగా వినుకొండ నియోజవర్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బెజ్జం వేణుగోపాలరెడ్డి మంత్రి, అధికారులు, ఎమ్మెల్యేలకు అసభ్య సంక్షిప్త సందేశాలను పంపినట్లు డీఎస్పీ వివరించారు.
వేణుగోపాలరెడ్డికి ఆంజనేయులు వ్యాపారికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఆంజనేయులు వ్యాపారంలో ముందుకు వెళ్తాడని భావించి వేరే వారి పేర్లతో సిమ్‌లు కొనుగోలు చేసి హైదారాబాద్‌కు చెందిన ప్రసాదరెడ్డి అనే న్యాయవాది సహాయంతో అసభ్య సందేశాలను పంపినట్లు తెలిపారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసినట్లు వివరించారు.. ఈ కేసులో మరో నిందితుడు ప్రసాదరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ సీఐలు బి. సురేష్‌బాబు, టి. దిలీప్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ కోటేశ్వరరావులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం వ్యాపారి అరెస్టు
Published Sun, May 24 2015 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM