ఎలుకా వచ్చె.. భద్రం తల్లో!
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తున్నాయి. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కాంట్రాక్టులో ‘లుకలుకల’మూలంగా చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఫలితంగా ఎలుకలు, పందికొక్కులు సైతం నిత్యం తిరగాడుతున్నాయి. పరిశుభ్రతకు నిలయంగా ఉండాల్సిన సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుపై ఇటీవల ఎలుక దాడి చేసి పొట్టన పెట్టుకున్న హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఆ వెంటనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కలెక్టర్ కోన శశిధర్ గత నెల 27న సర్వజనాస్పత్రిని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడాన్ని గమనించి ఏజెన్సీ నిర్వాహకుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులను పరిశీలించి అపరిశుభ్రతగా ఉండడంతో ఏకంగా రూ.1.20 లక్షలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎలుకల సంచారం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న కలెక్టర్.. ఇకపై ఒక్క ఎలుక కన్పించినా కాంట్రాక్టర్ నుంచి ఎలుకకు రూ.1000 వసూలు చేస్తానని హెచ్చరించారు. నెలనెలా రూ.13 లక్షలు ఇస్తున్నప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.
ఇంత జరిగినా ఆస్పత్రిలో పరిస్థితి మారిందా అంటే అది నామమాత్రమే. ప్రధానంగా కాన్పుల వార్డులో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ ఆస్పత్రిలో సగటున 25 వరకు కాన్పులు జరుగుతున్నాయి. డెలివరీ తర్వాత వారిని వార్డుల్లోకి తరలిస్తుంటారు. అయితే ఇక్కడ క్షణక్షణం భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఫలితంగా పంది కొక్కులు, ఎలుకల సంచారం ఎక్కువైంది. కాన్పుల వార్డు పక్కనే డ్రెయినేజీ ఉంది.
దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు వస్తున్నాయి. అవి నేరుగా గదుల్లోకి వస్తున్నాయి. కాన్పుల వార్డులోని ఆరోగ్యశ్రీ విభాగంలోని ఏసీల వద్దకు, ఆ పక్కనే ఉన్న గదుల్లోకి వస్తుండడంతో అక్కడున్న వారు భయపడుతున్నారు. అసలే పసిబిడ్డలు ఉంటున్న వార్డులివి. ఇక్కడ చూస్తే అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కనీసం ఎలుకలను పట్టడానికి వీలుగా బోన్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఐసీయూలో మాత్రం బోను ఏర్పాటు చేశారు.
ఇక నవజాత శిశు కేంద్రం పక్కన కూడా అపరిశుభ్రత ఎక్కువగా ఉండడంతో పందికొక్కులు వస్తున్నాయి. అయితే ఈ వార్డుకు కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో లోపలికి వెళ్లలేకపోతున్నాయి. ఆర్థో విభాగంలో కూడా పంది కొక్కులు, ఎలుకల సంచారం ఉంది. గాయపడిన వారికి కడుతున్న బ్యాండేజ్‌లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో ఎలుకలు వస్తున్నాయి. ఎఫ్‌ఎస్-1, ఎఫ్‌ఎస్-2 వద్ద కూడా పరిశుభ్రత పడకేసింది.