రియల్ దెబ్బ | Real blow | Sakshi
Sakshi News home page

రియల్ దెబ్బ

Published Wed, Feb 25 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

Real blow

స్థిరాస్తి వ్యాపారం స్తంభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పట్లో పుంజుకునేలా కనిపించడం లేదు. మూడేళ్లకు పైగా  స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంతో మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్ర విభజన జరిగినా..రియల్ బూమ్ పుంజుకోలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 
 ఒంగోలు టూటౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అనతి కాలంలోనే కోట్లు కూడబెట్టుకోవచ్చన్న ఆశతో.. అందులో దిగిన వారికి చుక్కలు కనపడుతున్నాయి. సరైన ధరలు..కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు.
 
నాడు ఇలా..
రియల్ ఎస్టేట్ వ్యాపారం జిల్లాలో 2006 నుంచి మూడు పూవులు..ఆరు కాయలుగా సాగింది. దేనికీ పనికి రాని భూములకు సైతం రెక్కలొచ్చాయి. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను ప్రభుత్వ ఖాళీ స్థలాలపై పడింది. రాజకీయ నాయకులు సైతం ప్రభుత్వ భూములపై డేగ కన్ను వేశారు. అవకాశం ఉన్న మేర దోచేశారు. ఆక్రమించుకున్న స్థలాలకు సైతం అధిక ధరలు పలికాయి. రూ.10 వేలకు కూడా కొనని  ఎకరం భూమి ప్రాంతాన్ని బట్టి లక్షల నుంచి కోట్లకు పలికింది. భూదందా విపరీతంగా పెరిగింది. పచ్చని పొలాలు సైతం ప్లాట్లుగా మారిపోయాయి. గ్రామ శివారు ప్రాంతాల్లో సైతం వెంచర్లు వెలిశాయి. పట్టణ, నగరాలకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములకు ఎక్కడ లేని ధరలు వచ్చాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట ప్రాంతంలో ఎకరా రూ.2.40 లక్షల  నుంచి రూ.1.70 కోట్లకు పెరిగింది.

దర్శి డివిజన్‌లో రెండు, మూడు లక్షలు అమ్మిన ఎకరా పొలం రూ.2.50 కోట్లు పలికి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైయింది. జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన దొనకొండ మండలంలో సెంటు స్థలం లక్ష పలికి ఔరా అనిపించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.  రహదారుల వెంట ఉన్న వ్యవసాయ భూముల్లో ఇంటి స్థలాల కోసం ప్లాట్లు వేయడం మొదలెట్టారు. ఒంగోలు నుంచి మార్కాపురం వరకు రోడ్ల వెంబడి వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరప్రాంతమైన కొత్తపట్నం, చీరాల, వేటపాలెం, ఇటు నెల్లూరు వరకు రెండొంతుల పొలాలు ప్లాట్లుగా మారాయి.

ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు కుప్పలు, తెప్పలుగా వేసిన వెంచర్లకు ఆకర్షణీయమైన అందాలు అద్దారు.   మధ్యవర్తులకు పూర్తిగా పని దొరికింది. వీరిలో కొంతమంది లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. కొంతమంది ప్రైైవేట్ ఇన్‌వెస్ట్‌మెంట్ కంపెనీలు పెట్టి బాగా సంపాదించారు.  అన్ని రంగాల వారు ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. అపార్ట్‌మెంట్ వ్యాపారాలు జోరుగా చేశారు. ఇలా 2010-11 వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బంగారు బాతులా మారింది.
 
నేడు ఇలా...
ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం నాన్చుడి ధోరణి చివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పూర్తిగా ముంచింది.  ఇక రాను,రాను స్థిరాస్తి వ్యాపారం  మందగించింది. చివరకు తెలంగాణా ఇచ్చినా స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగలేదు. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. స్థలం అడిగే నాథుడు లేకుండా పోయాడు.  వేసిన వందలాది  వెంచర్లలో చిల్లచెట్టు మొలిచాయి. కనిగిరి, పామూరు రోడ్లలో సెంటు లక్ష అమ్మితే నేడు సగానికి సగం విలువ పడిపోయింది.  పొదిలి, మార్కాపురంలలో ఎకరా  రూ.7 లక్షల విలువైన స్థలం నేడు రూ.3 లక్షలకు కూడా కొనని పరిస్థితి వచ్చింది.  బహుళ అంతస్తుల్లో ప్లాట్లు సైతం అమ్ముడుపోక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు.

 అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. భూములు కొనేవారు లేక వడ్డీ భారం పెరిగిపోయి చివరకు వడ్డీ వ్యాపారులకే ఆ భూములు స్వాధీనం చేస్తున్నవారున్నారు. గుంటూరు- విజయవాడను రాజధానిగా ప్రకటించినా.. రియల్‌బూమ్ అక్కడికే పరిమితమైంది. ఇతర జిల్లాలకు పాకలేదు. అయితే ముందు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందన్న ఆశలు చాలా మందిలో ఇంకా సజీవంగా ఉన్నాయి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement