జిల్లాలో ‘రియల్’ మోసగాడి మూలాలు
Published Mon, Jan 6 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
సాక్షి, ఏలూరు : రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి పలు జిల్లాల్లో జనం నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వ్యక్తి మూలాలు జిల్లాలోనే ఉన్నాయి. ట్యూటర్‌గా పనిచేస్తూ హాస్టల్‌లో ఉండి చదుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు వందల కోట్ల రూపాయలకు అధిపతి ఏకంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నిస్తున్నాడు.
పార్టీ టిక్కెట్టుకు రూ.30 కోట్లు!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నేత జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేశారు. పలు ఆరోపణలతో ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. అనంతరం లింగపాలెం గ్రామంలో మందుల షాపు నెలకొల్పి దానిని తీసేశారు. ఎర్రగుంటపల్లికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ‘నీట్‌ఫుల్’అనే నెట్‌వర్క్ వ్యాపారాన్ని నడిపారు. దాదాపు 4 వేల మంది నుంచి సుమారు రూ.40 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టి శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు, హైదరాబాద్ జిల్లాల్లో రూ.వంద కోట్ల వరకూ జనం సొమ్ము దోచేసి ఆ సంస్థ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. దాని కోసం పార్టీ ఫండ్‌గా సుమారు రూ.30 కోట్లు సమర్పించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేశాడంటున్నారు.
అందరూ అందరే..
ఉంగుటూరులో ఓ టీడీపీ నేత ఇదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జనాన్ని మోసం చేశారు. చెక్‌బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఓ నేత ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. అధికారులు ఆ ప్రాంతంలో పనిచేయాలంటేనే భయపడేలా ప్రవర్తిస్తుంటారు. ఈ ప్రవర్తనతోనే కేసులు మీదపడి జైలుకి కూడా వెళ్లివస్తుంటారు. ఏలూరులోనూ గొప్పగొప్ప వాళ్లున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికిపోయిన ఓ నాయకుడు ఇప్పుడు టీడీపీ ఏలూరు నియోజకర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ మరో బడా నేత కుమారుడు ఓ మహిళను వేధింపులకు గురిచేశాడంటూ కొద్దినెలల క్రితం కలకలం రేగింది. కొవ్వూరులో ఓ టీడీపీ నేత తాను నిర్వహిస్తున్న కళాశాల విద్యార్థినులను వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది.
Advertisement
Advertisement