సాక్షి ప్రతినిధి, కర్నూలు: నియోజకవర్గ అభివృద్ధికి ఏ ప్రజాప్రతినిధి అయినా సమీక్షలు.. సమావేశాలు.. ఆకస్మిక తనిఖీలు చేపడతాడు. అధికారుల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాడు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు అందుకు భిన్నం. అధికార పార్టీలో ఉన్నామనే ధీమానో.. అధికారులంటే బానిసలనుకున్నాడేమో కానీ తన చర్యలతో వారికి నిద్రలేకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా మహిళా అధికారులు ఆయన తీరుతో హడలెత్తిపోతున్నారు. ‘ఆయా శాఖల పనితీరుపై చర్చించాలి. అధికారులంతా తప్పక హాజరు కావాలి. రాకపోతే మీపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించడం ఆయనకు రివాజు. ఇలా వచ్చిన మహిళా అధికారిణుల పట్ల ఆయన వ్యవహార శైలితో వారు బెంబేలెత్తుతున్నారు. ఎమ్మెల్యే వెకిలి చేష్టలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు అక్కడికక్కడే ప్రతిఘటిస్తుండటంతో వారి పట్ల కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నాడు. ఇంకొందరు విధిలేని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. కర్నూలు డివిజన్ పరిధిలోని ఓ మహిళా అధికారిణి పట్ల వ్యవహరించిన తీరు జిల్లాలోనే చర్చనీయాంశమైంది. ఆ మహిళా అధికారిణి ఎమ్మెల్యే తనకు పంపిన మెసేజ్‌లను జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే ఉంటే పరువుపోతుందని భావించిన ఆమె మరో జిల్లాకు బదిలీ చేయించుకుని వెళ్లారు.
అదేవిధంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పాఠశాల తనిఖీకి వెళ్లిన ఆయన మహిళా ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించారు. గొడవ జరిగితే పరువు పోతుందని తెలుసుకున్న కీచకుడు సారీ చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కస్తూర్బా పాఠశాల ఉద్యోగిని పట్ల కూడా ఆయన ఇదేవిధంగా ప్రవర్తించారు. ఆమె కూడా ఎదురుదాడికి దిగడంతో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. ఆమె పనితీరు బాగోలేదంటూ తరచూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వేధింపులను తాళలేకపోయిన ఆమె చివరకు బదిలీ చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు.. మహిళా ఉద్యోగినులు ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నామనే మానసిక వేదనకు లోనవుతున్నారు.
ఓసారి ఫోన్ చేసి చనువుగా మాట్లాడటం.. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా సమాచారాలు కోరడం.. తద్వారా స్నేహం పెంచుకునే ప్రయత్నం చేయడంలో ఈయన నేర్పరి. ఇదే అలుసుగా.. వారితో తన స్థాయి మరిచి వ్యవహరిస్తున్న విషయం జిల్లా అధికారులకు తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగినులు ఆయన తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసే విషయమై ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే తీరుతో మహిళా అధికారులు హడల్
Published Fri, Dec 20 2013 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement