ఉదయగిరి: పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎర్రచందనం సంపద అక్రమంగా తరలిపోతూనే ఉంది. రెండేళ్లుగా సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు ప్రాంతాలకు చెందిన కొందరు ఉదయగిరిని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులకు ఎరవేసి పావులుగా వాడుకుంటున్నారు. వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఆయన పలువురు అనుచరులను ఏర్పాటుచేసుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎస్పీ సెంథిల్‌కుమార్ ఈ వ్యవహారంపై పూర్తి నిఘా పెట్టడంతో స్మగ్లింగ్ జోరు కాస్త తగ్గింది. అయినా అడపాదడపా ఈ ప్రాంతం మీదుగా రవాణా సాగుతోంది. స్మగ్లర్లకు ఉదయగిరి ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డుల అండ ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరికి కూడా ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఇద్దరు పోలీసు అధికారులు ఈ అక్రమ రవాణాకు పూర్తిగా సహకరించి లక్షలు గడించారనే విమర్శలు అప్పుడు బహిరంగంగా వినిపించాయి. పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ వ్యవహారంలో ముఖ్యపాత్ర వహించారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇప్పటికీ కొంతమంది ఇంటి దొంగలు ఈ అక్రమ రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని పలువురు అధికారులు, సిబ్బంది ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారని ప్రచారంకూడా జోరుగా సాగుతోంది.
ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసుల్ని భాగస్వామ్యం చేయడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న అటవీ అధికారుల్లో ఆందోళన కన్పిస్తోంది. వరికుంటపాడు మండలంలోని గొల్లపల్లి, పెద్దిరెడ్డిపల్లి, తోటలచెరువుపల్లికి చెందిన కొందరు భైరవకోన అడవుల్లో నుంచి పెద్దఎత్తున ఎర్ర దుంగలను తరలిస్తున్న వైనాన్ని బద్వేలు పోలీసులు రట్టుచేయడంతో స్మగ్లింగ్‌లో స్థానికుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. సీతారామపురం మండలంలో ఓ పోలీసు కానిస్టేబుల్ అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. వింజమూరు ప్రాంతంలో ప్రధాన స్మగ్లరుగా పేరుపొందిన ఓ వ్యక్తి నుంచి అక్కడ పోలీసులు భారీస్థాయిలో లబ్దిపొందారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో పనిచేసిన ఓ పోలీసు అధికారికి, మరో పోలీసు కానిస్టేబుల్‌కు ఆ స్మగ్లరుతో సంబంధాలు ఉన్నాయనే విషయం అప్పట్లో గుప్పుమంది. దుత్తలూరు మండలం నందిపాడు కేంద్రంగా కొందరు పెద్దలు ఈ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగివున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నందిపాడుకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్మగ్లర్ల వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ ప్రాంతానికి చెందిన సుమారు పాతికమంది వ్యక్తుల సమాచారం పోలీసు ల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో దుత్తలూరు మండలానికి చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఉదయగిరి దుర్గం ప్రాంతంలో హత్య జరిగిందనే వదంతులు పుట్టించి పట్టపగలే భారీ మొత్తంలో ఎర్ర దుంగలను తరలించినట్లు సమాచారం. అదేవిధంగా బద్వేలు సరిహద్దులో సోమవారం పట్టుబడిన వ్యానులో వింజమూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఈ కీలకమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ జరిపితే రెండేళ్లుగా స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న పెద్దమనుషులు, పోలీసులు, అటవీశాఖ అధికారుల గుట్టురట్టయ్యే అవకాశం ఉంది.
‘ఎర్ర’ స్మగ్లర్ల అడ్డా ఉదయగిరి
Published Fri, Dec 12 2014 2:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement