శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో ఒక్కహామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రంలో వివిధ పథకాల పేరుతో కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ‘నీరు-చెట్టు’ పేరుతో సొమ్మంతా లూటీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ తతంగాన్నంతా ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి నుంచి వైఎస్సార్ కూడలి వరకూ భారీఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.
మజ్జిగ వద్దు.. మంచినీళ్లు చాలు...
సీఎం చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున కేటాయించి చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మంచినీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారని, వీరికి నీరు అందించకుండా మజ్జిగ పంపిణీ చేస్తామని ప్రకటించడం వెనుక నిధుల దోపిడీ కుట్ర దాగిఉందన్నారు. బాబు సొంత సంస్థ హెరిటేజ్‌కు లాభం చేకూర్చేందుకే మజ్జిగ పంపిణీ కార్యక్రమమన్నారు.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.3 కోట్ల వ్యయంతో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని కోరారు. మజ్జిగ పంపిణీ దోపిడీని నిరసిస్తూ మే నెల 2వ తేదీన జిల్లాలోని 38 మండలాల్లో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు మండవిల్లి రవి, మామిడి శ్రీకాంత్, టి.కామేశ్వరి, కోరాడ రమేష్, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల దామోదరరావు, ఆర్.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
Published Thu, Apr 21 2016 11:27 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement