
రిజిస్ట్రేషన్ల భారం.. రూ.10 కోట్లు!
పీఎన్‌కాలనీ: ఆర్థిక వనరుల సమీకరణ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి సారించింది. భూముల రేట్లు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సవరించిన భూముల రేట్లు అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
స్థూలంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 10 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చేలా పెంపుదల ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏ ప్రాంతంలో ఎంత రేటు పెంచాలని ఇంకా నిర్ణయించనప్పటికీ 30 నుంచి 40 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లా అధికారులు బుధవారం సాయంత్రం సమావేశమై కొత్త రేట్లు నిర్ణయించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోనే పెంపుదలను అమలు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి రూ. 2 వేల నుంచి రూ.21 వేల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ధరలు, బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధరల మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ధరలు నిర్ణయిస్తారు.
రిజిస్ట్రేషన్ల జోరు
కాగా భూముల రేట్లు.. తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయని తెలుసుకున్న వినియోగదారులు ఆదరాబాదరాగా క్రయవిక్రయాలు పూర్తి చేసుకుంటున్నారు. 30 నుంచి 40 శాతం వరకు అదనపు భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో గత కొద్దిరోజులుగా జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లులు జోరుగా సాగుతున్నాయి.దీనికితోడు శ్రావణమాసం మంచిరోజులు కావడంతో లావాదేవీలు ఊపందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 102.48 కోట్ల ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ధరలు పెంచుతున్నందున ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించగలమని అధికారులు భావిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనే పెంపు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త రేట్లు మున్సిపల్, అర్బన్ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ పెంపుదల వల్ల జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
-ఆర్.సత్యనారాయణ,
జిల్లా రిజిస్ట్రార్, శ్రీకాకుళం