ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రాజెక్టుల పరిధిలోని ముంపు గ్రామాలకు చెందిన వారికి కేటాయించే పునరావాస కాలనీలు ఆదర్శ కాలనీలుగా ఉండాలని ఆర్‌ఆర్ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్లతో బుధవారం సాయంత్రం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల పరిధిలోని ముంపు కాలనీల్లో నివసించేవారికి ఏర్పాటు చేసే పునరావాస కాలనీలకు వారు స్వచ్ఛదంగా వచ్చే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
బడులు, గుడులు, కమ్యూనిటీ హాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విశాలమైన వాతావరణంలో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయడం ద్వారా వారు కోరుకున్న విధంగా వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుందని వివరించారు. ముంపు ప్రాంతాలకు చెందినవారికి పునరావాస కాలనీల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ఇందిరా ఆవాజ్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో ముంపు ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా నివసిస్తుంటే వెంటనే వారిని పునరావాస కాలనీలకు తరలించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున నిధుల విడుదలకు సంబంధించిన ప్రణాళికలు పంపించాలన్నారు. ప్రణాళికలను బట్టి నిధులు విడుదల చేస్తామని శ్రీదేవి స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్ నాయక్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వి.నాగరాజారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పీ గ్లోరియా, కొండయ్య, రవీంద్రలతోపాటు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్
జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ ఆదేశించారు. తన చాంబర్‌లో స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.