7,966 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ  | Replacement of 7966 linemen posts | Sakshi
Sakshi News home page

7,966 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ 

Published Sat, Aug 3 2019 3:25 AM | Last Updated on Sat, Aug 3 2019 5:09 AM

Replacement of 7966 linemen posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 7,966 మంది జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పోస్టులకు ఆగస్టు 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని  గ్రామ సచివాలయాల్లో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 682 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో  గ్రామ సచివాలయాల్లో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 1,241 పోస్టులున్నాయి.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు ఉండీ ఈ ఏడాది జులై 1నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మేన్‌ ట్రేడ్‌ కోర్సుతో పాటు పదో తరగతి  వారు అర్హులు. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులో ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయెన్సస్‌ అండ్‌ రివైండింగ్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌  చేసిన వారు కూడా అర్హులే. రిజర్వేషన్లు, ఇతర వివరాలను ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొదటి 20 శాతం పోస్టులను ఓపెన్‌ క్యాటగిరీలో మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80 శాతం పోస్టులను లోకల్‌ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ సర్కిల్‌(జిల్లా) పరిధిలోని వారు ఆ సర్కిల్‌(జిల్లా)లో పోస్టులకు లోకల్‌ అభ్యర్థులు అవుతారు. ఓ అభ్యర్థి గరిష్టంగా మూడు సర్కిళ్లలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పారదర్శకంగా పోస్టుల భర్తీ 
లైన్‌మెన్‌ పోస్టులను నిబంధనల మేరకు పారదర్శకంగా భర్తీ చేస్తాం. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్‌ ప్రాతిపదికన పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం. అక్టోబరు 2 నాటికి లైన్‌మెన్‌ విధుల్లో చేరుతారు.      
– ఎన్‌.శ్రీకాంత్, ట్రాన్స్‌కో సీఎండీ 

లైన్‌మెన్‌ పోస్టులకు  www. apeasternpower. com,  www. apspdcl. in,  http:// gramasachivalayam. ap. gov. in,  http://59.144.184.105/ jlm19 వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతమున్న పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement